National Best Teacher Awards: ఎన్టీఆర్ జిల్లా అధ్యాపకులకు జాతీయ అవార్డులు
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:41 AM
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇద్దరు అధ్యాపకులు జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రొఫెసర్ అయ్యర్ విజయలక్ష్మి(స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ), డాక్టర్ మెండా దేవానంద్ కుమార్...
విజయలక్ష్మి, దేవానంద్ కుమార్ ఎంపిక
ఉన్నత, సాంకేతిక విద్య విభాగంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
న్యూఢిల్లీ/విజయవాడ/మైలవరం/మండవల్లి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇద్దరు అధ్యాపకులు జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రొఫెసర్ అయ్యర్ విజయలక్ష్మి(స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ), డాక్టర్ మెండా దేవానంద్ కుమార్ (డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మైలవరం)ను కేంద్రం ఉన్నత, సాంకేతిక విద్య విభాగంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. 2025 సంవత్సరానికి గానూ మంగళవారం కేంద్ర విద్యా శాఖ.. దేశవ్యాప్తంగా వివిధ ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలలో పనిచేస్తున్న 21 మంది అధ్యాపకులకు ఈ అవార్డులను ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున నలుగురు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ప్రొఫెసర్ సాంకేత్ గోయల్(బిట్స్‌పిలానీ, హైదరాబాద్), ప్రొఫెసర్ వినిత్ ఎన్‌బీ(ఐఐటీ, హైదరాబాద్) ఈ అవార్డులు స్వీకరించనున్నారు. సెప్టెంబరు 5న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. ఆర్కిటెక్చర్ విభాగంలో ప్రొఫెసర్ విజయలక్ష్మి ఏపీలో వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు చేశారు. అధిక ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో ఏసీలు లేకుండా లోపల చల్లగా ఉండే విధంగా బిల్డింగ్(గ్రీన్ బిల్డింగ్)ల రూపకల్పనపై ప్రయోగం చేశారు. ఆమె రాసిన 60 పరిశోధనా పత్రాలన్నీ స్కోపస్ ఇండెక్స్ (ప్రముఖ అంతర్జాతీయ పత్రాల పరిశోధన సంస్థ)లో వచ్చాయి. మైలవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ దేవానంద్ కుమార్ తెలుగులో ఎంఏ, పీహెచ్‌డీ, హిస్టరీలో ఎంఏ, ఎంఈడీ చేశారు. 38 పరిశోధక పత్రాలు, ఐదు గ్రంథాలు రాశారు. ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన ఈయన గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024ను అందుకున్నారు.