Share News

Financial Help: అంధ మహిళకు ఎన్‌ఆర్‌ఐల ఆర్థిక సహాయం

ABN , Publish Date - Oct 18 , 2025 | 06:53 AM

చిన్నతనంలోనే చూపు కోల్పోయి, ఎనిమిదేళ్ల కుమారుడ్ని పోషించుకునేందుకు నానా కష్టాలు పడుతున్న అంఽధ మహిళ పాములపాటి జ్యోతికి ప్రవాస భారతీయులు అండగా నిలిచారు.

Financial Help: అంధ మహిళకు ఎన్‌ఆర్‌ఐల ఆర్థిక సహాయం

  • రూ.10.50 లక్షలు పోస్టల్‌ డిపాజిట్‌

  • అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం, ఇల్లు కేటాయింపునకు చర్యలు

  • కష్టంలో ఉన్నవారికి తోడుగా ఉంటాం: నాదెండ్ల బ్రహ్మంచౌదరి

గుంటూరు సిటీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): చిన్నతనంలోనే చూపు కోల్పోయి, ఎనిమిదేళ్ల కుమారుడ్ని పోషించుకునేందుకు నానా కష్టాలు పడుతున్న అంఽధ మహిళ పాములపాటి జ్యోతికి ప్రవాస భారతీయులు అండగా నిలిచారు. ‘పాపం..జ్యోతి’ శీర్షికన సెప్టెంబరు 17న ‘ఆంధ్రజ్యోతి’ గుంటూరు జిల్లా సంచికలో ప్రచురితమైన కథనాన్ని ఇంటర్‌ నెట్‌లో చూసి ఆమెకు సహాయం చేసేందుకు కమ్మ అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా, కమ్మ అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూ ఇంగ్లాండ్‌, పెన్సిల్వేనియా, సియాటిల్‌, సెయింట్‌ లూయిస్‌, మిచిగాన్‌, నార్త్‌ కరోలీనా, డెలావేర్‌, టెక్సాస్‌, కాలిఫోర్నియా, న్యూ జెర్సీ తదితర రాష్ర్టాల్లోని కమ్మ సంఘాలు ముందుకు వచ్చాయి. వారు సేకరించిన రూ.10.50 లక్షలు గుంటూరులోని పోస్టాఫీ్‌సలో జ్యోతి పేరుతో సుమారు తొమ్మిదేళ్లకు డిపాజిట్‌ చేశారు. జ్యోతి కుమారుడుకి 18 సంవత్సరాలు వచ్చే నాటికి డిపాజిట్‌ విలువ రూ.21 లక్షలు కానుంది. ఆ పోస్టల్‌ బాండును శుక్రవారం గుంటూరులోని కమ్మ జన సేవాసమితి ఆడిటోరియంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాదెండ్ల బ్రహ్మంచౌదరి మాట్లాడుతూ కష్టంలో ఉన్నవారిని ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.


‘ఆంధ్రజ్యోతి’లో జ్యోతి కథనం చూసి మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి సహాయం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దీంతో ఆమెకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగంతో పాటు ఇల్లు కూడా కేటాయించే ఏర్పాటు చేశారని చెప్పారు. కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌, డైరెక్టర్స్‌ అందరూ కలిసి రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు బ్రహ్మం చౌదరి తెలిపారు. కోనేరు మోహన్‌బాబు రూ.25 వేలు, పాములపాటి రవీంద్రబాబు రూ.10 వేలు, అల్లపనేని మోహన్‌రావు రూ.10 వేలు, పెద్ది భాస్కర్‌రావు రూ.ఐదు వేలు, వట్టికూటి సాంబశివరావు రూ.ఐదు వేలు అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఇచ్చే సంతోషం మరెక్కడ లభించదని గుంటూరు మేయర్‌ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. జ్యోతి పరిస్థితి తెలుసుకున్న ప్రవాస భారతీయులు 130 మంది సాయం అందించారని రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్‌ తెలిపారు. ఆమె కుమారుడు విద్య కోసం సంఘం తరపున సహకరిస్తామన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 06:54 AM