Share News

Penamaluru: నీచ పోస్టుల భాస్కర్‌రెడ్డికి సంకెళ్లు

ABN , Publish Date - Nov 07 , 2025 | 03:55 AM

మహిళలంటే కనీస గౌరవం లేకుండా, వ్యక్తిత్వ హననానికి పాల్పడే వైసీపీ సోషల్‌ మీడియాకు చెందిన ఎన్‌ఆర్‌ఐని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Penamaluru: నీచ పోస్టుల భాస్కర్‌రెడ్డికి సంకెళ్లు

  • సీఎం సతీమణి సహా పలువురిపై బూతు పోస్టులు

  • తండ్రి చనిపోవడంతో లండన్‌ నుంచి రాక.. అంత్యక్రియలు పూర్తి

  • చెకప్‌ కోసం విజయవాడ కామినేని ఆసుపత్రికి రాక

  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

అమరావతి, పెనమలూరు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): మహిళలంటే కనీస గౌరవం లేకుండా, వ్యక్తిత్వ హననానికి పాల్పడే వైసీపీ సోషల్‌ మీడియాకు చెందిన ఎన్‌ఆర్‌ఐని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన మాలపాటి భాస్కర్‌రెడ్డి లండన్‌లో ఉంటున్నారు. వైసీపీ హయాంలో అత్యంత హేయమైన పోస్టులు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. పవన్‌ కల్యాణ్‌.., మంత్రి లోకేశ్‌, మాజీ సీజే జస్టిస్‌ ఎన్‌వీ రమణ... ఇలా ఎవరినీ వదిలపెట్టకుండా సామాజిక మాధ్యమాల్లో అసభ్య భాషను ఉపయోగిస్తూ మెసేజ్‌లు చేశాడు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ టీడీపీ కార్యకర్తలు భాస్కర్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న భాస్కర్‌రెడ్డి స్వదేశానికి రాకుండా లండన్‌లోనే ఉండిపోయాడు. అయితే ఐదు రోజుల క్రితం ఆయన తండ్రి మరణించారు. అంత్యక్రియల నిమిత్తం చోడవరం వస్తే పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో తండ్రి మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా వెంగంపల్లికి రప్పించాడు. అక్కడే దహన కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిసింది. బుధవారం రాత్రి చోడవరం చేరుకున్న భాస్కర్‌రెడ్డి గురువారం తెల్లవారుజామున ఆరోగ్య పరీక్షల కోసం కానూరు వంద అడుగుల రోడ్డులోని కామినేని ఆసుపత్రికి తన సోదరునితో కలసి వెళ్లాడు. పోలీసులు వెంటనే భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భాస్కరరెడ్డి తల్లిదండ్రులది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనాసాగరం మండలంలోని వెంగంపల్లి అనే కుగ్రామం. నలభై ఏళ్ల క్రితమే చోడవరం వలస వచ్చి ముఠా పనులు చేసుకుని పొట్టపోసుకునేవారు. భాస్కరరెడ్డి ఇక్కడే జన్మించాడు. బీటెక్‌ పూర్తి చేసిన ఆయన లండన్‌లో ఉద్యోగం సంపాదించాడు.

Updated Date - Nov 07 , 2025 | 03:59 AM