Share News

Commercial Taxes Department: నవంబరులో 2,697 కోట్ల జీఎస్టీ వసూళ్లు

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:16 AM

నవంబరు నెలలో రాష్ట్రానికి జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ఆదాయం తగ్గిందని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ బాబు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Commercial Taxes Department: నవంబరులో 2,697 కోట్ల జీఎస్టీ వసూళ్లు

  • గత ఏడాది కంటే 4.6 శాతం క్షీణత

  • సంస్కరణలతో ఆదాయం తగ్గుముఖం

  • వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ వెల్లడి

అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): నవంబరు నెలలో రాష్ట్రానికి జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ఆదాయం తగ్గిందని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ బాబు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నవంబరులో నికర జీఎస్టీ రూ.2,697 కోట్లు వసూలు కాగా.. గత ఏడాది నవంబరులో సాధించిన ఆదాయం కంటే ఇది 4.6 శాతం తక్కువ. ప్రకటనలోని వివరాల ప్రకారం.. ఆటో రంగం, సిమెంట్‌, ఎఫ్‌ఎంసీజీ, ఎలక్ర్టానిక్‌, పాల ఉత్పత్తులు ఇతర వస్తువులపై రేట్లు తగ్గడం వల్ల నవంబరులో జీఎస్టీ ఆదాయం తగ్గింది. పెట్రోలియం అమ్మకాలు, లిక్కర్‌పై వ్యాట్‌, వృత్తి పన్ను, జీఎస్టీ కలిపి మొత్తం నవంబరులో రూ.4,124 కోట్ల పన్ను ఆదాయం వసూలైంది. గతేడాది వసూలైన ఆదాయం కంటే ఇది 3.17 శాతం తక్కువ. ఎస్‌జీఎస్టీ 7.35 శాతం మేర తగ్గి రూ.1,109.17 కోట్లకు పరిమితమైంది. ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ కూడా రూ.1,588.15 కోట్లకు తగ్గింది. గత ఏడాది నవంబరులో వచ్చిన ఐజీఎస్టీ కంటే ఇది 2.57 శాతం తక్కువ. మొంథా తుఫాను కారణంగా పెట్రోలియం అమ్మకాల ఆదాయం తగ్గింది. గత నవంబరు కంటే 1.06 శాతం తగ్గి రూ.1,306.61 కోట్లు వసూలైంది. లిక్కర్‌పై వ్యాట్‌ ఆదాయం 4.82 శాతం మేర తగ్గింది. గత నవంబరులో రూ.74 కోట్ల వ్యాట్‌ వసూలు కాగా, ఈ నవంబరులో అది రూ.70.40 కోట్లకు పడిపోయింది. వృత్తి పన్ను వసూళ్లు గత ఏడాది నవంబరు కంటే 46.22 శాతం పెరిగి రూ.43 కోట్లకు చేరుకున్నాయి. సెప్టెంబరు 22వ తేదీ నుంచే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్టోబరులో దసరా, దీపావళి కారణంగా జీఎస్టీ ఆదాయం పెరిగింది.

Updated Date - Dec 02 , 2025 | 05:17 AM