‘ఓపెన్’ బార్‌లకు నోటిఫికేషన్
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:29 AM
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఓపెన్ కేటగిరికి కేటాయించిన బార్‌లకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని మారుతీనగర్‌లో ఉన్న జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు, మచిలీపట్నంలోని ఎకై్ౖసజ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ జి.గంగాధరరావు వేర్వేరుగా సోమవారం సాయంత్రం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో 130, కృష్ణాజిల్లాలో 39 బార్‌లు
26 వరకు తుది గడువు
మూడు శ్లాబ్‌లుగా ఫీజు విధానం
బార్‌కు నాలుగు దరఖాస్తులు వస్తేనే డ్రా
ఆరు వాయిదాలుగా ఫీజు చెల్లింపునకు అవకాశం
(ఆంధ్రజ్యోతి - విజయవాడ/మచిలీపట్నం):
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఓపెన్ కేటగిరికి కేటాయించిన బార్‌లకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని మారుతీనగర్‌లో ఉన్న జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు, మచిలీపట్నంలోని ఎకై్ౖసజ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ జి.గంగాధరరావు వేర్వేరుగా సోమవారం సాయంత్రం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 130, కృష్ణా జిల్లాలో 39 బార్‌లకు నోటిఫికేషన్ వెలువరించారు. అభ్యర్థులు 26వ తేదీ సాయంత్రం ఐదు గంటలోపు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో హాల్ టికెట్లు అందజేస్తారు. వాళ్లంతా దరఖాస్తులను ఇక్కడే అందజేయాల్సి ఉంటుంది. ప్రతి బార్‌కు నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారు. ఓపెన్ కేటగిరి బార్‌లకు 28వ తేదీన లాటరీ తీస్తారు. ఒక వ్యక్తి ఎన్ని బార్‌లకు అయినా దరఖాస్తులు చేసుకోవచ్చు.
జనాభా ఆధారంగా ఫీజులు
నగరాలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉన్న జనాభాను బట్టి ఫీజులను నిర్ణయించారు. 50వేల లోపు ఉన్న నగర పంచాయతీల్లో బార్‌కు రూ.35లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 50వేలు నుంచి ఐదు లక్షల వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రూ.55 లక్షలు చెల్లించాలి. ఐదు లక్షలు పైబడిన నగరాల్లో బార్‌లకు రూ.75 లక్షలను ఫీజులుగా నిర్ణయించారు. లాటరీ ద్వారా బార్ దక్కించుకున్న తర్వాత ఆరు దఫాలుగా ఈ ఫీజును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో డిపాజిట్‌గా రూ.5లక్షలు, దరఖాస్తు ఫీజుగా రూ.10వేలు చెల్లించాలి. బార్‌లు దక్కించుకున్న తర్వాత ప్రతి ఏడాది ఫీజు పది శాతం పెంచుతారు. ఇది కాకుండా డిపోల నుంచి కొనుగోలు చేసిన సరుకుపై రెట్ (రిటైల్ ఎక్సైజ్ టాక్స్) చెల్లించాల్సి ఉంటుంది. వైసీపీ ప్రభుత్వంలో దీన్ని ముందుగానే చెల్లించుకునే వారు. సరుకును విక్రయించిన రెండు నెలల తర్వాత రెట్‌ను చెల్లించే అవకాశం వ్యాపారులకు ప్రభుత్వం కల్పించింది. కొత్తగా ఏర్పాటు చేసుకోబోయే బార్‌లను ఉదయం పది గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం ప్రాంతాలను బట్టి దరఖాస్తులకు ఫీజులను నిర్ణయించింది. దీన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఏకంగా ఒకటే ఫీజును నిర్ణయించింది.
రేపు రిజర్వేషన్ కేటగిరి నోటిఫికేషన్
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 14 బార్‌లను గీత కార్మికులకు రిజర్వ్ చేశారు. ఇందులో పది బార్‌లు ఎన్టీఆర్ జిల్లాలో, నాలుగు బార్‌లు కృష్ణాజిల్లాలో ఉన్నాయి. వాటికి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. గౌడ, గౌడ్ ఉపకులాలకు ఈ బార్‌లను రిజర్వ్ చేశారు. ఏ బార్‌ను ఏ ఉపకులానికి కేటాయించాలన్న దానిపై కలెక్టర్ లక్ష్మీశ సోమవారం లాటరీ తీశారు. విజయవాడలో ఒకటి, రెండు, మూడు, ఐదు, ఆరు, ఎనిమిది, తొమ్మిది నంబర్ల బార్‌లను గౌడ సామాజిక వర్గానికి కేటాయించారు. విజయవాడలో నాలుగు, ఏడు, కొండపల్లి మున్సిపాలిటీ(పర్యాటక కేంద్రం) బార్‌లను గౌడ్ సామాజిక వర్గానికి కేటాయించారు.