Share News

Illegal Mining Leases: భారతి సిమెంట్స్‌కు నోటీసులు

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:22 AM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌కు గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థకు కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో...

Illegal Mining Leases: భారతి సిమెంట్స్‌కు నోటీసులు

  • సున్నపురాయి లీజుల రద్దుకు గనులశాఖ చర్యలు

  • 15 రోజుల్లోగా బదులివ్వాలని ఆదేశం

  • 2024లో చట్టవిరుద్ధంగా 50 ఏళ్లకు లీజు

  • కడప జిల్లాలో 744 ఎకరాలు ధారాదత్తం

  • న్యాయసలహా పేరిట ‘భారతి’కి మేలు

  • హైకోర్టు తీర్పునకు వక్రభాష్యంతోనే ఆదేశాలు

  • ఈ ఏడాది మొదట్లో విచారణకు కేంద్రం ఆదేశం

  • తాజాగా లీజుల రద్దుకు నోటీసులు

  • ఏసీసీ, రామ్‌కోకు కూడా..

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌కు గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థకు కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో చట్టవిరుద్ధంగా కేటాయించిన సున్నపురాయి భూముల మైనింగ్‌ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. భారతి సిమెంట్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయానికి పోస్టు ద్వారా నోటీసులు పంపించింది. నోటీసులు అందిన 15 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, అదానీ నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్‌ సిమెంట్‌ కంపెనీస్ (ఏసీసీ)కు, రామ్‌కో సిమెంట్స్‌కు కూడా నోటీసులు వెళ్లాయి. 2023, 2024లలో అప్పటి జగన్‌ సర్కారు ఈ మూడు కంపెనీలకు వేర్వేరుగా సున్నపురాయి నిల్వలున్న భూములను కేంద్ర గనులు, ఖనిజాలు(అభివృద్ధి-నియంత్రణ) చట్టం-1957 (ఎంఎండీఆర్‌ యాక్ట్‌) నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా.. వేలంలో కాకుండా లీజులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భారతి సిమెంట్స్‌కు ఇచ్చిను లీజులు ఎంఎండీఆర్‌ యాక్ట్‌ను ఉల్లంఘించడమే కాదు, 2023 సెప్టెంబరులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చి ఆదేశాలను ఉల్లంఘించి, న్యాయసలహా పేరిట భారీ డ్రామా నడిపి లీజులను నిర్ధారిస్తూ, కాలపరిమితిని 50 ఏళ్లుగా ప్రకటించారు. ఈ మూడు లీజులపై 2024లోనే కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లగా విచారణ జరపాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. దీనిపై ఈ ఏడాది జూన్‌ 10న ‘భారతికి భూ హారతి’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ వార్తను ప్రచురించింది. అయితే రాష్ట్ర సర్కారు నింపాదిగా ఇప్పుడు ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. జగన్‌ సర్కారు చేసిన అక్రమాలు, కోర్టు ఆదేశాల ఉల్లంఘన తెలియాలంటే అసలు కేంద్ర చట్టంలో ఏముందో తెలుసుకోవాలి.


వేలం ద్వారానే లీజులు: కేంద్ర చట్టం

2015 వరకు ప్రభుత్వానికి అందిన దరఖాస్తుల ఆధారంగా సున్నపురాయు లీజులను మైనింగ్‌ కోసం కేటాయించేవారు. అయితే 2015లో ఎంఎండీఆర్‌ చట్టానికి కేంద్రం సవరణ చేసి కొత్తగా సెక్షన్‌ 10లో ఏ అనే క్లాజును చేర్చింది. దీని ప్రకారం సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల కాలపరిమితి దానంతట అదే ముగిసిపోతుంది. ఇక ఆ దరఖాస్తులు పనికిరావు. మైనింగ్‌ కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఈ మేరకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని 2016 నవంబరు 23న కేంద్రం లేఖలు రాసింది. పర్యావరణ, ఇతర అనుమతులు లేని ఒప్పందాలకు ఇదే వర్తిస్తుందని తెలిపింది. కొత్తగా కేటాయించే లీజులు వేలంద్వారానే జరగాలని 2021లో మరో సవరణ చేసింది. వీటిని ఉల్లంఘించి భారతి సిమెంట్స్‌కు లీజుల కేటాయింపు జరిగింది.


ఇదీ భారతి సిమెంట్స్‌ కథ

భారతి సిమెంట్స్‌ కన్నా ముందు రఘురామ్‌ సిమెంట్స్‌ ఉంది. జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో రఘురామ్‌ సిమెంట్స్‌కు 2006, మార్చి 27న 2037.52 ఎకరాలను కేటాయించారు. అయితే, నాణ్యమైన సున్నపురాయి నిల్వలు లేవనే కారణంతో ఆ భూమిలో 475.16 ఎకరాలను 2008 నవంబరులో ఆ కంపెనీ వదలుకుంది. రఘురామ్‌ సిమెంట్స్‌ అనేది 2009 ఫిబ్రవరిలో భారతి సిమెంట్స్‌గా అవతరించింది. ఇందుకు ఆనాటి ప్రభుత్వం ఆమోదముద్రవేస్తూ 2009 ఫిబ్రవరి 13న జీవో 5ను విడుదల చేసింది. అధికారికంగా రఘురామ్‌ సిమెంట్స్‌ ద్వారా భారతి సిమెంట్స్‌కు 1562.36 ఎకరాల్లో సున్నపురాయి నిల్వలున్న లీజులున్నాయి. ఇందులో 744.74 ఎకరాలకు మాత్రమే కంపెనీకి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌(ఎల్‌ఓఐ)లు ఇచ్చా రు. ఆ వెంటనే లీజు అమలు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు కంపెనీ మైనింగ్‌ చేపట్టాలి. అందుకోసం చట్టబద్ధమైన ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. కానీ, అది జరగలేదు. భారతి సిమెంట్స్‌ యజమాని భారతి రెడ్డి. ఆమె వైఎస్‌ జగన్‌ సతీమణి. ఆ తర్వాత తెరవెనక ఏం జరిగిందో జగన్‌పై నమోదయిన కేసుల్లో వీటిని సీబీఐ పొందుపరిచింది. రఘురామ్‌ సిమెంట్స్‌ అనేది భారతి సిమెంట్స్‌గా మారిపోతే అన్నీ అనుకూలంగా ఉంటాయని భావించారు. వేలకోట్ల విలువైన లీజులు, ఎల్‌ఓఐ, పర్యావరణ అనుమతులు కూడా సింపుల్‌గానే మారిపోతాయనుకున్నారు. కానీ, అదేమీ జరగలేదు. భారతి సిమెంట్స్‌కు అనుమతులు రాలేదు. ఒప్పందాలు జరగలేదు. రాష్ట్ర విభజన తర్వాత జగన్‌ తనకున్న పరిచయాలతో భారతి సిమెంట్స్‌లో కదిలిక తీసుకొచ్చారు. మైనింగ్‌ ప్లాన్‌కు 2015లో కేంద్రం అనుమతి ఇచ్చింది. అప్పటికి ఆ కంపెనీకి పర్యావరణ అనుమతి(ఈసీ), కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(సీఎస్ఈ) వంటివి రాలేదు. ఇక మైనింగ్‌ ఒప్పందం ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకోలేదు. దీంతో మైనింగ్‌ ప్లాన్‌ కు ఆమోదం పొందినా, 2015 నాటికి ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు గనుక 2015లో ఎంఎండీఆర్‌ చట్ట సవరణ ప్రకారం లీజు రద్దయిపోవాల్సిందే.


2016లోనే రద్దు నోటీసులు..

2015లో ఎంఎండీఆర్‌ చట్టంలో చేసిన సవరణ మేరకు సెక్షన్‌ 10 (ఏ) ప్రకారం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని, అనుమతులు పొందని లీజులు చెల్లవు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని 2016 నవంబరులోనే కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆనాటి ప్రభుత్వం తొలిసారిగా భారతి సిమెంట్స్‌కు నోటీసులు ఇచ్చింది. చట్టసవరణ ప్రకారం లీజులు ఎందుకు రద్దుచేయకూడదో వివరణ ఇవ్వాలని 2016 డిసెంబరు 30న భారతి సిమెంట్స్‌కు నోటీసులు ఇచ్చింది. ఆ కంపెనీ స్పందించక పోవడంతో 2017 జనవరి 10న లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ)ని రద్దుచేసింది.

జగన్‌ వచ్చాక మేలు..

జగన్‌ సర్కారు వచ్చాక భారతి సిమెంట్స్‌కు మేలుచేయడం మొదలుపెట్టారు. తొలుత తమకు లీజులు కొనసాగించాలని కేంద్ర గనుల శాఖ వద్ద రివిజన్‌ అప్లికేషన్‌ వేయగా దాన్ని కేంద్రం తిరస్కరించింది. సవరణ చట్టం ప్రకారం కొత్తగా దరఖాస్తుచేసుకొని వేలంలో లీజులు దక్కించుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీలేక కంపెనీ 2021లో హైకోర్టును ఆశ్రయుంచింది. ఈ కేసును కోర్టు సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచింది. దీంతో జగ న్‌ సర్కారు నాటి గ నుల శాఖ డైరెక్టర్‌తో ఓ లేఖ రాయించారు. ‘భారతి సిమెంట్స్‌ కేసు హైకోర్టులో పెండి ంగ్‌లో ఉంది. అది ఇప్పట్లో తేలేలా లేదు. కాబట్టి, ఆ కంపెనీకి ఎంఎండీఆర్‌ చట్టం ప్రకారం 744 ఎకరాల్లో ఉన్న సున్నపురాయి నిల్వలపై 50 ఏళ్ల లీజులు ఇవ్వాలి’ అని ఆ లేఖ సారాంశం. మరోవైపు హైకోర్టు ఇచ్చే ఆదేశాలకు లోబడి తుది నిర్ణయం తీసుకుందామని, ఇప్పటికయుతే, భారతి సిమెంట్స్‌కు 50 ఏళ్ల లీజులు ఇస్తున్నట్లుగా 2022 సెప్టెంబరు 8న గనుల శాఖ ఉత్తర్వులిచ్చింది. అయితే, ఆ జీవో 63ను అప్పట్లో చీకట్లో ఉంచారు. వెలుగులోకి రానివ్వలేదు.

హైకోర్టులో చుక్కెదురు..

భారతి సిమెంట్స్‌ హైకోర్టులో 2021లో దాఖలు చేసిన కేసులో అనుకూల తీర్పురాలేదు. కేవలం ఆ కంపెనీ వాదనలు విని చట్టం మేరకు చర్యలు తీసుకోవాలని 2023 సెప్టెంబరు 21న హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాగైనా దొడ్దిదారిన లీజు పునరుద్ధరణ ఉత్తర్వులు ఇవ్వాలని గట్టి ప్రయత్నమే చేశారు. హైకోర్టు తీర్పుపై ఓ మాజీ న్యాయమూర్తి నుంచి సలహా తీసుకొని లీజులు పునరుద్ధరించుకోవచ్చని సలహా తీసుకున్నారు. దాన్ని నాటి ఏజీతో కూడా సర్టిఫై చేయించారు.


2024 ఎన్నికల ముందు హడావుడిగా..

భారతి సిమెంట్స్‌ వాదన వినమని మాత్రమే హైకోర్టు చెప్పింది. ఆ కంపెనీకి అనుకూలంగా లీజులు ఇవ్వమని చెప్పనేలేదు. కానీ, నాటి జగ న్‌ సర్కారు తన ఇంటి కంపెనీ కోసం వ్యవస్థలను తప్పుదోవపట్టించి ఏకంగా హైకోర్టు తీర్పుపై మాజీ న్యాయమూర్తి సలహా తీసుకొని లీజులు పునరుద్ధరించేశారు. 2024 ఫిబ్రవరి 2న జీవోలు 4, 5 ద్వారా భారతి సిమెంట్స్‌కు ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో అత్యంత విలువైన సున్నపురాయి నిల్వలున్న 744 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. మైనింగ్‌ లీజును ఏకంగా 50 ఏళ్లకు పొడిగించారు.

ఏసీసీ, రామ్‌కోకూ అడ్డగోలు మేలే..

ఏసీసీ ప్రస్తుతం అదానీ గ్రూప్‌ నియంత్రణలో ఉంది. దానికి 2010లోనే 2,463 ఎకరాల సున్నపురాయి నిల్వలున్న భూములు కేటాయించారు. అయితే, సకాలంలో అనుమతులు పొందలేకపోయింది. మూడేళ్లలో సిమెంట్‌ పరిశ్రమను ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఆ సంస్థ లీజుల కాలపరిమితి కూడా దాటింది. జగన్‌ సర్కారు ఆ కంపెనీకి 997 హెక్టార్లలో లీజులను కేటాయిస్తూ 2023 నవంబరు 15న ఆదేశాలు ఇచ్చింది. ఇది కేంద్ర చట్టానికి పూర్తి విరుద్ధంగా జరిగిందని తేలింది. అలాగే, ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్దిరోజుల ముందు ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలోని 267 ఎకరాల్లోని సున్నపురాయు లీజులను 2024 మార్చి 15న రామ్‌కోకు జగన్‌ సర్కారు కట్టబెట్టింది. ఇదీ చట్టవిరుద్ధమే అని కేంద్రం చెబుతోంది. భారతి సిమెంట్స్‌, ఏసీసీ, రామ్‌కోకు ఇచ్చిన లీజులు ఎందుకు రద్దుచేయకూడదంటూ గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే ఎంఎండీఆర్‌ చట్టం ప్రకారం ఆ లీజులను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.

Updated Date - Dec 17 , 2025 | 04:23 AM