TTD Shilpa College Principal: అది విష్ణుమూర్తి విగ్రహం కాదు
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:36 AM
సాక్షాత్తూ శ్రీమహావిష్ణువుకే అపచారం జరిగిందంటూ వైసీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి చూపించిన విగ్రహం అసలు విష్ణుమూర్తిదే కాదని తేలిపోయింది.
2003 నుంచీ అక్కడే పడివున్న అసంపూర్ణ శనైశ్చర ప్రతిమ
చేతిలో బాలుడు, కపాల పాత్ర, కాళ్ల వద్ద సింహం బొమ్మలు
ఎడమవైపు రెండోచేతిలో విల్లు, కుడివైపు రెండోచేతిలో బాణం
విగ్రహానికి శంఖుచక్రాలు ఉన్నప్పటికీ నుదుటిపై నామాల్లేవు
రెండేళ్ల కిందటే గుర్తించిన టీటీడీ శిల్ప కళాశాల యంత్రాంగం
తిరుపతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): సాక్షాత్తూ శ్రీమహావిష్ణువుకే అపచారం జరిగిందంటూ వైసీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి చూపించిన విగ్రహం అసలు విష్ణుమూర్తిదే కాదని తేలిపోయింది. తిరుపతిలోని అలిపిరి సమీపంలో పడివున్న విగ్రహాన్ని చూపుతూ ఇది నేరం, ఘోరం, ద్రోహం అని మంగళవారం ఆయన వాపోయారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, హిందూ సంఘాలన్నీ ఉద్యమించాలని పిలుపునిచ్చారు కూడా. ఇంతకీ అది విష్ణుమూర్తి విగ్రహమా? కాదా? అనేదానిపై ‘ఆంధ్రజ్యోతి’ వివరాలు సేకరించింది.
రెండేళ్ల కిందటే గుర్తించాం: శిల్ప కళాశాల ప్రిన్సిపాల్
ప్రస్తుతం వివాదానికి కారణమైన విగ్రహం తమ కళాశాల పక్కనే ఉందని, దాన్ని రెండేళ్ల కిందటే గుర్తించామని టీటీడీ శిల్ప కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి చెప్పారు. అప్పట్లో తాము కూడా అది విష్ణుమూర్తి విగ్రహమై ఉంటుందనుకున్నామని, దోషాలు లేకుండా ఉంటే తెచ్చుకుని కళాశాలలో ఉపయోగించుకోవాలని భావించామని చెప్పారు. తీరా దగ్గరకు వెళ్లి పరిశీలించాక విష్ణుమూర్తి విగ్రహం కాదని తేలడంతో అక్కడే వదిలేశామన్నారు.
విగ్రహం అక్కడ ఎందుకుంది?
1970వ దశకంలో తిరుమలలో ఆలయాల పునరుద్ధరణ, నడక దారి మెట్ల పునరుద్ధరణ వంటి పనులను టీటీడీ చేపట్టింది. ఇందుకోసం తమిళనాడు నుంచి పలువురు శిల్పులను పిలిపించారు. అలిపిరిలో టీటీడీ శిల్ప కళాశాల వద్ద వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. వారికోసం ప్రస్తుతం విగ్రహం పడివున్న చోట తాత్కాలిక షెడ్లు వేశారు. ఈ విధంగా వచ్చిన శిల్పుల్లో పట్టు కన్నన్ ఆచారి ఒకరు. ఆయన టీటీడీకి సంబంధించిన పనులు చేస్తూనే రాయలచెరువు వద్ద స్థలం కొనుగోలు చేసి అక్కడ ప్రైవేటుగా శిల్పాలు తయారు చేసేవారు. కర్ణాటకకు చెందినవారు శనైశ్చరుడి విగ్రహం కావాలంటూ రూ.2లక్షలు అడ్వాన్సు చెల్లించారు. నమూనా ఫొటో కూడా ఇచ్చి దాని ఆధారంగా విగ్రహాన్ని రూపొందించాలని కోరారు. దీంతో తమిళనాడులోని కాంచీపురం వద్ద పటిమలకుప్పం నుంచి తెప్పించిన కృష్ణశిలపై విగ్రహం చెక్కడం మొదలుపెట్టారు. ఈలోపు ఆర్థిక సమస్యలతో కన్నన్ ఆచారి వర్క్‌షాపు మూసేశారు. స్థలం ఇతరులకు విక్రయించేశారు. విగ్రహం చెక్కమని కోరినవారు ఎన్నేళ్లయినా రాలేదు. అసంపూర్ణంగా మిగిలిన ఆ విగ్రహాన్ని 2003లో టీటీడీ కాంట్రాక్టర్లు అలిపిరిలో తమకు కేటాయించిన షెడ్లున్న ప్రాంతానికి తీసుకొచ్చి పడేశారు. అదే ఏడాది అక్టోబరులో సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద నక్సలైట్లు క్లైమోర్ మైన్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడి తాత్కాలిక షెడ్లను పోలీసులు తొలగించారు. విగ్రహం పెద్దది కావడంతో ఎవరూ తీసుకువెళ్లలేదు. ముళ్లపొదల్లో అలాగే ఉండిపోయింది. తర్వాత కన్నన్ ఆచారి అనారోగ్యంతో మరణించారు. భూమన రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా ఉన్నపుడూ ఆ విగ్రహం అక్కడే పడివుంది. ఆ ప్రదేశాన్ని 6నెలల కిందట చదును చేసి టైల్స్‌తో కూడిన ఫ్లోరింగ్ పనులు మొదలు పెట్టారు. పొదల్లో ఉన్న విగ్రహాన్ని పక్కకు తరలించి టైల్స్ అమర్చాక తిరిగి అక్కడే పెట్టారు. విగ్రహం చెక్కిన కన్నన్ ఆచారి వద్ద పనిచేసిన వారు ఇపుడు టీటీడీ శిల్ప కళాశాలలో ఉద్యోగులుగా ఉన్నారు. విగ్రహం గురించిన సమాచారం వీరందరికీ తెలుసు. ఇవేవీ విచారించకుండానే టీటీడీపై బురద చల్లడానికి అవకాశం దొరికిందనే హడావుడిలో భూమన నానా యాగీ చేయడం శ్రీవారి భక్తులను ఆశ్చర్యపరిచింది.
భూమనకు 41ఏ నోటీసులు
శ్రీమహావిష్ణువుకు అపచారమంటూ భూమన తీవ్ర విమర్శలు చేయడాన్ని టీటీడీ సీరియ్‌సగా తీసుకుంది. టీటీడీపై, దేవుళ్లపై అసత్య ప్రచారాలతో వీడియో పోస్టు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ డీఈఈ గోవిందరాజులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు గురువారం తిరుపతిలోని డీఎస్పీ ఆఫీసుకు రావాలంటూ భూమనకు ఎస్‌ఐ పూజిత బుధవారం 41ఏ నోటీసు అందజేశారు. తాను బిజీ అని భూమన చెప్పడంతో, వీలు చూసుకుని రావాలంటూ ఎస్‌ఐ సూచించారు. ఈ నెల 23న వస్తానంటూ భూమన పోలీసులకు తెలిపారు.
విష్ణుమూర్తి ఎందుకు కాదంటే..
భూమన ఆరోపిస్తున్న అలిపిరిలోని విగ్రహానికి మీసాలు ఉన్నాయి. ఎడమవైపు న్న నాలుగో చేతిలో బాలుడు, కుడివైపున మూడో చేతిలో కపాల పాత్ర, పాదాల వద్ద సింహం ప్రతిమ ఉన్నాయి. విష్ణుమూర్తి విగ్రహానికి ఇవేవీ ఉండదగినవి కావని వెంకటరెడ్డి చెప్పారు. విగ్రహానికి ఇరువైపులా శంఖుచక్రాలు ఉన్నప్పటికీ నుదుటిపై నామాలు లేవని తెలిపారు. దీనిని శనైశ్చరుడి అసంపూర్తి విగ్రహంగా భావిస్తున్నామన్నారు. శంఖుచక్రాలు చెక్కించడమనేది విగ్రహ తయారీకి ఆర్డర్ ఇచ్చిన వ్యక్తుల విశ్వాసానికి, ఇష్టానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. అవి ఉన్నంత మాత్రాన విష్ణుమూర్తిగా భావించడానికి వీల్లేదన్నారు. భూమన విడుదల చేసిన వీడియోలో ఆగమ శాస్త్రాన్ని ఉదహరిస్తూ శనైశ్చరుడికి ఒక చేతిలో విల్లు, మరో చేతిలో బాణం ఉంటుందన్నారు. అలిపిరి విగ్రహానికి కూడా ఎడమ వైపు రెండో చేతిలో విల్లు, కుడివైపు రెండో చేతిలో బాణం ఉన్నాయి. అయినా కూడా ఆయన హడావుడి చేశారు.