ఒక్క రూపాయి విడుదల చేయలేదు
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:30 PM
బడ్జెట్ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.2,600 కోట్లు కేటాయించిందని, ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి విడుదల చేయలేదని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న
కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులు
అడ్డుకున్న పోలీసులు.. తోపులాట
అరెస్టుకు నిరసనగా గాంధీ విగ్రహం వద్ద బైఠాయింపు
కర్నూలు ఎడ్యుకేషన్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.2,600 కోట్లు కేటాయించిందని, ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి విడుదల చేయలేదని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.షాభీర్‌బాషా, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తూ కలెక్టరేట్‌లోకి ఏఐఎస్‌ఎఫ్ నాయకులు, విద్యార్థులు దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మద్య తోపులాట జరిగింది. ఈ సందర్బంగా ఏఐఎస్‌ఎఫ్ నాయకులు బందెల నాసర్‌జీ, ఎస్.షాభీర్‌బాషా మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాలపై ఘర్షణకు దిగిన పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వానికి పని చేస్తున్నారని ఆరోపించారు.
పేద విద్యార్థులకు, పీజీ విద్యకు శాపంగా మారిన జీవో.77ను రద్దు చేయాలని, అదే విదంగా పెండింగ్ ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘యువగళం’ పాదయాత్రలో నారా లోకేశ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా కేవలం రూ.600 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బకాయిలు విడుదల చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన నాయకులను అరెస్టు చేసి సొంతపూచీకత్తు విడుదల చేశారు. ఈ అరెస్టుకు నిరసనగా గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి, శరత కుమార్, దామాస్, ఉపాధ్యక్షులు దస్తగిరి, వీరేష్, సిటీ అధ్యక్ష కార్యదర్శులు అభి, అశోక్, నాయకులు శేఖర్, ఆల్తాఫ్, శివ, మోహన, వినోద్, హరీష్, విద్యార్థులు పాల్గొన్నారు.