Heavy Rainfall: ఉత్తరాన వానలు.. దక్షిణ కోస్తాలో ఎండలు
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:30 AM
ఉత్తర కోస్తాలో సోమవారం భారీ వర్షాలు కురవగా, దక్షిణ కోస్తాలో ఎండలు మండిపోయాయి. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో...
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
విశాఖపట్నం/అమరావతి, సె ప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఉత్తర కోస్తాలో సోమవారం భారీ వర్షాలు కురవగా, దక్షిణ కోస్తాలో ఎండలు మండిపోయాయి. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరిల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలం దిశగా వీస్తుండడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో ఉత్తరాంధ్రలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కువచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా, అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి. విశాఖ నగర శివారు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ వద్ద 8, పెందుర్తి పంప్‌హౌస్ వద్ద 7.9, వేపగుంటలో 6.6, కొత్తపాలెంలో 6.6, అనకాపల్లి జిల్లా కె.కోటపాడులో 6.8, గంధవరంలో 6.1, శ్రీకాకుళం జిల్లా నరస్నపేటలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రంగా ఉంది. కావలిలో 38.8, బాపట్ల, నెల్లూరుల్లో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, మంగళవారం ఉత్తరకోస్తాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.