Share News

Ram Mohan Naidu: లాజిస్టిక్స్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర

ABN , Publish Date - Jul 13 , 2025 | 04:38 AM

విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకూ ఉత్తరాంధ్ర ఒక లాజిస్టిక్స్‌ హబ్‌గా మారనుందని పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.

Ram Mohan Naidu: లాజిస్టిక్స్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర

  • భోగాపురం-మూలపేట కోస్టల్‌ కారిడార్‌తో మహర్దశ

  • విశాఖలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌

విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకూ ఉత్తరాంధ్ర ఒక లాజిస్టిక్స్‌ హబ్‌గా మారనుందని పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. విశాఖలో శనివారం నిర్వహించిన రోజ్‌గార్‌ మేళాలో పాల్గొన్న ఆయన 52 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడి భోగాపురం నుంచి మూలపేట వరకూ కోస్టల్‌ కారిడార్‌ మంజూరు చేయించారని పేర్కొన్నారు. ఇంతకుముందు విశాఖ నుంచి భోగాపురం వరకూ కోస్టల్‌ కారిడార్‌ మంజూరైన సంగతి తెలిసిందేనన్నారు. మూలపేటలో పోర్టు నిర్మాణమవుతోందని, అక్కడే విమానాశ్రయం కూడా వస్తుందని, ఇప్పటికే భోగాపురం విమానాశ్రయం పనులు చురుగ్గా జరుగుతున్నాయని వివరించారు. ఒకవైపు జాతీయ రహదారి, మరోవైపు కోస్టల్‌ కారిడార్‌ రావడం, రైల్వే లైన్ల విస్తరణ కూడా జరుగుతుండడం వల్ల పోర్టులు, విమానాశ్రయాలకు కనెక్టివిటీ పెరుగుతుందని, దీంతో ఈ ప్రాంతం లాజిస్టిక్స్‌ హబ్‌గా మారుతుందన్నారు. రోజ్‌గార్‌ మేళాలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, విశాఖ రైల్వే డీఎం బొహ్రా పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 04:40 AM