Weather Forecast: 16నే ఈశాన్యం రాక
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:25 AM
నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా మారింది.
నేడు కోస్తాలో భారీ వర్షాలు
విశాఖపట్నం/అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా మారింది. దక్షిణాదిలో పలు రాష్ట్రాలు తప్ప దేశంలో అనేక ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారి పొడి వాతావరణం నెలకొంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర, తూర్పు, ఈశాన్య, మధ్యభారతంతోపాటు తెలంగాణ వరకు నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన దక్షిణాదిలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ నిపుణులు తమిళనాడు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దక్షిణ తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు, కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.