Northeast Monsoon Season: తీరు మారిన ఈశాన్యం
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:15 AM
దక్షిణాదిలోని ఐదు వాతావరణ సబ్‌డివిజన్‌లలో వర్షాలకు దోహదపడే ఈశాన్య రుతుపవనాలు విఫలమయ్యాయా? అంటే అవుననే చెబుతున్నారు కొందరు వాతావరణ నిపుణులు...
రోజుల తరబడి వర్షాభావం
సాగుకు సహకరించని రుతుపవనాలు
తుఫాన్ల ప్రభావంతోనే కుమ్మరింత
కనిపించని ముసురు వర్షాలు
జాడలేని తూర్పు గాలులు
దీర్ఘకాలం కొనగుతున్న చలి తీవ్రత
రేపటితో ముగియనున్న సీజన్
విశాఖపట్నం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): దక్షిణాదిలోని ఐదు వాతావరణ సబ్‌డివిజన్‌లలో వర్షాలకు దోహదపడే ఈశాన్య రుతుపవనాలు విఫలమయ్యాయా? అంటే అవుననే చెబుతున్నారు కొందరు వాతావరణ నిపుణులు. బంగాళాఖాతంలో తుఫాన్ల సమయంలో మినహా మిగిలిన రోజుల్లో వర్షాల జాడ కనిపించలేదు. దక్షిణ తమిళనాడులోని డెల్టా ప్రాంతంలో కొన్ని రోజులు మోస్తరు వర్షాలు కురిశాయి తప్ప ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ, దక్షిణ కర్ణాటకల్లో ముసురువర్షాలు కురవలేదు. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో తుఫాన్ల తర్వాత ఎక్కువగా వర్షాలకు కారణమైన తూర్పు గాలుల ప్రభావం ఒకటి, రెండు వారాలు తప్ప మిగిలిన రోజులు కనిపించలేదు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల సీజన్ తీరుమారిందని నిపుణులు అంటున్నారు. ఈ సీజన్‌లో కురిసే వర్షాలతోనే తమిళనాడు, రాయలసీమలోని కొన్ని జిల్లాలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, దక్షిణ ప్రకాశం జిల్లాలు, కేరళ, కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయం జరుగుతుంది. ఇంకా తాగునీటికి అవసరమైన చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడాలి. అటువంటిది ఒకేసారి తుఫాన్లతో నీళ్ల కుమ్మరింత మినహా రైతులకు ఉపయోగపడే వర్షాలు కురవలేదు. ఈ ఏడాది తుఫాన్లు లేకపోతే ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో తీవ్ర వర్షాభావం కొనసాగి ఉండేది. అక్టోబరు నెల రెండోవారం వరకు నైరుతి రుతుపవనాలు కొనసాగడం కూడా ఈశాన్య రుతుపవనాలపై ప్రభావం చూపిందని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది అక్టోబరు 16న దక్షిణాదిలో ఈశాన్య రతుపవనాలు ప్రవేశించాయి. వాతావరణ శాఖ లెక్కల మేరకు డిసెంబరు 31తో ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగియనున్నది. అక్టోబరు చివరి వారంలో వచ్చిన మొంథా, నవంబరు చివరిలో వచ్చిన దిత్వా తుఫాన్ల ప్రభావంతో ఏపీ, తమిళనాడుల్లో వర్షాలు కురిశాయి. ఆ తర్వాత డిసెంబరు తొలివారం నుంచి వర్షాలు నిలిచిపోయాయి. ఈ నెల మూడో వారంలో తమిళనాడు డెల్టా ప్రాంతంలో కొన్ని రోజులు వర్షాలు కురిశాయి. ఆ తర్వాత వర్షాల జాడలేదు. ఏపీ వరకు చూస్తే ఈ నెల తొలివారంలో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రెండుమూడు రోజులు వర్షాలు కురిశాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో చలితీవ్రత పెరిగింది.
ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతం నుంచి వీచే తూర్పు గాలులు ఈ సీజన్‌లో దాదాపుగా లేవని చెప్పాలి. తూర్పుగాలులు ప్రతిసారి వారం వరకు ప్రభావం చూపడంతో వర్షాలు కురుస్తుంటాయి. అటువంటిది ఈ ఏడాది తూర్పు గాలుల జాడలేకపోవడంపై వాతావరణ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కారణాలపై అధ్యయనం చేయాల్సి ఉందని వాతావరణ అధికారి సముద్రాల జగన్నాథకుమార్ తెలిపారు. ఈనెలలో దక్షిణ తమిళనాడులోని డెల్టా ప్రాంతంలో కొన్ని రోజులు తూర్పుగాలులతో వర్షాలు కురిశాయి తప్ప ఉత్తర తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో చినుకు లేదన్నారు. ఈ సీజన్‌లో ఆదివారం వరకు 285.9 మి.మీ.లకుగాను 357.6 మి.మీ.లు (25 శాతం అధికం) వర్షపాతం నమోదైంది. అయితే తుఫాన్ల సమయంలో కురిసిన వర్షాలతోనే ఏపీలో మిగులు వర్షపాతం నమోదైందని జగన్నాథకుమార్ పేర్కొన్నారు. దఫదఫాలుగా మోస్తరు వర్షాలు కురిసే వాతావరణం ఈ ఏడాది కనిపించలేదని, దీనిపై అధ్యయనం చేయాలని తెలిపారు.