IMD Director General: నైరుతి కాలం పెరిగింది
ABN , Publish Date - Sep 06 , 2025 | 06:13 AM
దేశంలో ఎక్కువ వర్షాలకు దోహదం చేసే నైరుతి రుతుపవనాల కాలం పెరిగిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.
కొన్నేళ్లుగా రుతుపవనాల విస్తరణలో జాప్యం
క్లైమేట్ చేంజ్‌తో గాడ్పులు,అతిశీతల గాలులు, ఆకస్మిక వరదలు
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర
విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కువ వర్షాలకు దోహదం చేసే నైరుతి రుతుపవనాల కాలం పెరిగిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. క్లైమేట్ చేంజ్ ప్రభావంతో కొన్ని సంవత్సరాల నుంచి నైరుతి రుతుపవనాల సీజన్‌లో అనేక మార్పులు వచ్చాయన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఏయూలో నిర్వహించిన సైన్స్ కాంక్లేవ్‌కు హాజరైన ఆయన.. తొలుత వాతావరణంలో మార్పులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబరు వరకూ 4 నెలల కాలాన్ని నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తాం. అయితే కొన్నాళ్ల నుంచి రుతుపవనాల తీరులో అనేక మార్పులు వచ్చాయి. జూన్ 1న కేరళను తాకే విషయంలో మార్పులు పెద్దగా లేకపోయినా జూలై 15కు బదులు అదే నెల 8వ తేదీ నాటికే వాయవ్య భారతానికి విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ 29వ తేదీకల్లా దేశం మొత్తానికి విస్తరించాయి. అలాగే సెప్టెంబరు 17 నుంచి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం కావలసి ఉండగా కొద్ది సంవత్సరాల నుంచి కొంత జాప్యం జరుగుతోంది’ అని తెలిపారు. ఈ ఏడాది నైరుతి సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఏప్రిల్ 15న ఇచ్చిన ముందస్తు అంచనాలో పేర్కొన్నామన్నారు.
అధిక వర్షపాతం నమోదైన సమయాల్లో ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడడం, నగరాలు వరదల్లో చిక్కుకుంటాయని వివరించారు. పశ్చిమ హిమాలయ ప్రాంతాలైన జమ్ము కశ్మీర్, హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండలో కొండ చరియలు విరిగిపడడానికి బలమైన రుతుపవనాల ప్రభావమే కారణమన్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వాయవ్య భారతంలో అధిక వర్షపాతం నమోదైందని, ప్రస్తుతం బిహార్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ తప్ప దేశంలో ఏపీ, తెలంగాణ సహా అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో వాతావరణ బులెటిన్ల రూపకల్పనకు అనువుగా పలు మోడళ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఏఐకు అనుగుణంగా సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
ప్రాణాలు తీస్తున్న పిడుగులు!
వాతావరణ మార్పుల ప్రభావంతో దేశంలో పిడుగులు, మెరుపుల తీవ్రతకు అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని మహాపాత్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఒడిశా, బిహార్‌లో పిడుగులు, ఉరుములు, మెరుపుల తీవ్రత ఎక్కువగా ఉండడానికి భౌగోళిక పరిస్థితులు కొంత కారణం కావచ్చన్నారు. నైరుతి సీజన్ ముగిసిన తర్వాత స్వల్పకాలం పసిఫిక్ మహాసముద్రంలో లానినా పరిస్థితులు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. క్లైమేట్ చేంజ్ ప్రభావంతో దేశంలో వడగాడ్పులు, అతిశీతల గాలులు, కుంభవృష్టి వర్షాలు, ఆకస్మిక వరదల తీవ్రత పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేలా మరింత కచ్చితమైన బులెటిన్లు రూపొందించేలా అధ్యయనం చేస్తున్నామని వివరించారు.