Share News

Weather Department: రేపే ఈశాన్యం రాక

ABN , Publish Date - Oct 15 , 2025 | 05:20 AM

దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడింది.

Weather Department: రేపే ఈశాన్యం రాక

  • 19న బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం/అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. అలాగే, నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే సమయం ఆసన్నమైంది. మంగళవారం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వైదొలిగాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి గురువారం నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించనున్నాయి. అదే సమయంలో దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతువపనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కాగా, మంగళవారమే ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతంలోకి ప్రవేశించాయని కొందరు వెదర్‌మెన్‌ ప్రకటించారు. కాగా, నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. దీని ప్రభావంతో అరేబియా సముద్రంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడుతుంది. దీంతో 19 నుంచి తమిళనాడు, కోస్తాంధ్ర, సీమల్లో వర్షాలు పెరుగుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో వర్షాలు పడతాయని పేర్కొంది.

Updated Date - Oct 15 , 2025 | 05:21 AM