Share News

Heavy Rainfall: నేడే ఈశాన్యం రాక

ABN , Publish Date - Oct 16 , 2025 | 05:07 AM

దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలగే వాతావరణం నెలకొంది. ఉత్తర, మధ్య, తూర్పు భారతంతోపాటు దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం....

 Heavy Rainfall: నేడే ఈశాన్యం రాక

  • వారం రోజుల్లో రెండు వాయుగుండాలు

  • ఒకటి ఉత్తరకోస్తా దిశగా వచ్చే అవకాశం

  • దక్షిణ కోస్తా, సీమలో రెండు రోజులు భారీ వర్షాలు

విశాఖపట్నం/అమరావతి/తిరుమల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలగే వాతావరణం నెలకొంది. ఉత్తర, మధ్య, తూర్పు భారతంతోపాటు దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుండటంతో గురువారం దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించనున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర వైపునకు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, కేరళ, కర్ణాటకలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హిందూ మహాసముద్రానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇంకా బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు దక్షిణాది రాష్ట్రాల వైపు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే వారం రోజుల్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వేర్వేరుగా వాయుగుండాలు ఏర్పడనున్నాయి. అరేబియా సముద్రంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు వచ్చే రెండు, మూడు రోజుల్లో హిందూ మహాసముద్రం నుంచి భారీగా పడమర గాలులు అరేబియా సముద్రం వైపు, బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీయనున్నాయి.


దీని ప్రభావంతో కేరళ, కర్ణాటకకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఈనెల 19వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది బలపడి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో 20 నుంచి 22వ తేదీ మధ్య వాయుగుండంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 26వ తేదీకల్లా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ మోడళ్లు విశ్లేషిస్తున్నాయి. అదే సమయంలో ఈనెల 21వ తేదీ తరువాత దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈనెల 26వ తేదీకల్లా వాయుగుండంగా బలపడనున్నది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు వచ్చి ఆ తర్వాత దిశ మార్చుకుని బంగ్లాదేశ్‌ వైపు వెళ్లనున్నదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.దీనిపై మరో ఐదారు రోజుల తర్వాత స్పష్టత వస్తుందన్నారు.

తిరుమలలో జోరు వాన

తిరుమలలో బుధవారం జోరు వాన కురిసింది. వేకువజామున 4.30 గంటలకు చిరు జల్లులతో మొదలై తర్వాత గంట పాటు జోరున వర్షం కురిసింది. దీంతో ఆలయం ముందున్న భక్తులు షెడ్ల కిందకు పరుగులు తీశారు. శ్రీవారి ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధులు, రోడ్లు, కాటేజీ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. వాన తగ్గిన తర్వాత తిరుమలలో చలి తీవ్రత కూడా పెరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిరుమల శేషాచల కొండలను దట్టమైన పొగమంచు కప్పేసింది.

Updated Date - Oct 16 , 2025 | 08:16 AM