Share News

North Andhra Floods: వణికిన ఉత్తరాంధ్ర

ABN , Publish Date - Oct 04 , 2025 | 04:26 AM

ఉత్తరాంధ్రలో కుండపోత వానలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వాయుగుండం కారణంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో....

North Andhra Floods: వణికిన ఉత్తరాంధ్ర

  • పెనుగాలుల బీభత్సానికి విరిగిన చెట్లు, స్తంభాలు.. విశాఖ, సిక్కోలు జిల్లాలు అతలాకుతలం

  • నలుగురి మృతి.. మృతుల్లో వృద్ధ దంపతులు

  • కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తం

  • ఉగ్రరూపం దాల్చిన వంశధార, నాగావళి నదులు

  • ‘హుద్‌హుద్‌’ గుర్తొచ్చి హడలెత్తిన విశాఖ వాసులు

  • కొద్ది క్షణాలపాటు గంటకు 66 కి.మీ. వేగం

  • నీట మునిగిన పంటలు.. పలు కాలనీలు

విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతగిరి, పార్వతీపురం, విజయనగరం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో కుండపోత వానలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వాయుగుండం కారణంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో గురువారం ఎడతెరిపిలేని వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈదురుగాలులకు విద్యుత్‌ తీగపడి విశాఖలో ఒకరు, గోడలు కూలి సిక్కోలు జిల్లాలో ఇద్దరు, మన్యం జిల్లాలో ఒకరు.. మొత్తం నలుగురు మృతి చెందారు. సిక్కోలు జిల్లాకు సంబంధించి.. ఎగువన ఒడిశాలోనూ భారీవర్షాలు కురవడంతో ఆ వరద కూడా జిల్లాను ముంచెత్తింది. వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదీ పరీవాహక ప్రాంతాలను దాటి ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం అతలాకుతలమయ్యారు. ముఖ్యంగా పాతపట్నం, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. 17 మండలాల్లో 8,690 ఎకరాల వరి పంట పూర్తిగా ముంపునకు గురైంది. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. జిల్లా అంతటా సుమారు 20 గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గురువారం రాత్రి నుంచి వంశధార నదిలో వరద అధికమైంది. శుక్రవారం నుంచి నాగావళి నది ఉధృతమైంది. పంట పొలాలు, ఇళ్లు జలమయమయ్యాయి. మందస మండలం హంసరాలి పంచాయతీ సవర టుబ్బూరులో గోడ కూలి సవర బుద్ధయ్య (64), రూపమ్మ(60)అనే వృద్ధ దంపతులు మృతి చెందారు. పలుచోట్ల మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. మన్యం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురుపాం మండలం ఉదయంపురం కాలనీకి చెందిన కె.అరవింద్‌ గోడకూలి మృతి చెందాడు. ఇక, విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో అరటి, చెరకు, మొక్కజొన్న పంటలు ధ్వంసమయ్యాయి. గజపతినగరం మండలంలోని చిట్టయ్యవలసలో తెగిపడిన విద్యుత్‌ తీగలు తగిలి ఐదు గేదెలు శుక్రవారం మృతిచెందాయి. చంపావతి, నాగావళి, వేగావతి, సువర్ణముఖి నదులు పొంగాయి.


అప్రమత్తమైన మంత్రులు, అధికార యంత్రాంగం

కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎప్పటికప్పుడు శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు వాటిల్లకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి.. అధికారుల బృందం.. ఎమ్మెల్యేలతో కలసి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. విశాఖలో గురువారం ఉదయం 11 గంటల సమయాన కొద్ది క్షణాలు 66 కి.మీ. వేగంతో వీచిన గాలులు 11 ఏళ్లనాటి (2014 అక్టోబరు 12) హుద్‌హుద్‌ను తలపించాయి. అనేకచోట్ల చెటు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. కంచరపాలెంలో టీ స్టాల్‌ నడుపుతున్న బత్తిన ఈశ్వరరావు (52) విద్యుత్‌ వైరు తెగి పడడంతో మృతిచెందారు. దుకాణం వద్ద టీ తాగుతున్న గవర కంచరపాలేనికి చెందిన మరో వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విద్యుత్‌ శాఖకు 1.78 కోట్ల నష్టం

ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాలు, వీచిన పెనుగాలులకు విద్యుత్‌ శాఖకు రూ.1.78 కోట్ల నష్టం వాటిల్లిందని ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌ శుక్రవారం తెలిపారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండల పరిధిలో గల చిమిడిపల్లి-తైడ స్టేషన్ల మధ్య గురువారం మధ్యాహ్నం కొత్తవలస-కిరండూల్‌ (కేకే) లైన్‌లో ఓహెచ్‌సీ (ఓవర్‌హెడ్‌ కేటనరీ) విద్యుత్‌ తీగలపై చెట్లు విరిగిపడడంతో సాయంత్రం వరకూ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


వంశధార, నాగావళి, గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం!

అమరావతి, పోలవరం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): గోదావరి, వంశధార, నాగావళి నదుల వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 36.90 అడుగులకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టు నుంచి 8,57,707 క్యూసెక్కుల జలాలను జలవనరులశాఖ అధికారులు దిగువకు విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగుల నీటిమట్టం నమోదైంది.

2,905 హెక్టార్ల పంట మునక

ఉత్తరాంధ్రతో పాటు బాపట్ల జిల్లాలో వర్షాలకు 2,905 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. నాలుగు జిల్లాల్లోని 14 మండలాల్లో 107గ్రామాలకు చెందిన 2,828మంది రైతులకు చెందిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలు ముంపునకు గురైనట్లు గుర్తించింది.

1.jpg

తీరం దాటిన వాయుగుండం

  • నేడూ ఉత్తరాంధ్రలో భారీవర్షాలు.. పలు జిల్లాల్లో వానలు

  • అరేబియా సముద్రంలో ‘శక్తి’ తుఫాన్‌

  • 10న బంగాళాఖాతంలో అల్పపీడన

ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాను ఆనుకుని రెండు రోజులపాటు పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం గురువారం సాయంత్రం గోపాల్‌పూర్‌కు సమీపంలో తీరం దాటింది. ఆ తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో శుక్రవారం ఉదయం వాయుగుండంగా బలహీనపడి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లపై కొనసాగుతోంది. కాగా, శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, అరేబియా సముద్రంలోని వాయుగుండం గురువారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా, శుక్రవారం నాటికి తుఫాన్‌గా బలపడింది. దీనికి ‘శక్తి’ అని పేరుపెట్టారు. శుక్రవారం రాత్రికి తీవ్ర తుఫాన్‌గా బలపడి పశ్చిమ మధ్య అరేబియా సముద్రం వైపు పయనించనుంది. మరోవైపు ఈనెల 10న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా వైపు రానుందని వాతావరణ నిపుణులు చెప్పారు.


మృతుల కుటుంబాలకు 4లక్షల పరిహారం

  • ఉత్తరాంధ్రలో వర్షాలు, వరదలపై కలెక్టర్లతో సీఎం సమీక్ష

భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారికి సంబంధించి, ఆయా కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వరద కారణంగా నీట మునిగిన పంటను లెక్కించి, నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. కాగా, భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.

ఉపశమన చర్యలు చేపట్టండి: పవన్‌

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే ఉపశమన చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, రక్షిత తాగునీటి సరఫరాశాఖ అధికారులను ఆయన అప్రమత్తం చేశారు.

Updated Date - Oct 04 , 2025 | 06:56 AM