Minister Nimmala: 2 వేల కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:44 AM
ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం
1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి
2.48 లక్షల ఎకరాలు స్థిరీకరణ
ఐదేళ్లూ జగన్ ప్రాజెక్టులను గాలికి వదిలేశారు: నిమ్మల
అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇంకా తేదీ ఖరారు కాలేదని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు రెండేళ్లలో రూ.2000 కోట్లు ఖర్చు చేసి ఉత్తరాంధ్రలోని కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. వంశధార, తోటపల్లి, వంశధార-నాగావళి అనుసంధానం, జంఝావతి, హిరమండలం, నాగావళి-చంపావతి, మహేంద్ర తనయ, తారకరామ తీర్థసాగర్, మడ్డువలస రిజర్వాయర్ వంటి కీలక ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై జలవనరుల శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఉత్తరాంధ్రలో కీలకమైన తొమ్మిది ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు 2.48 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుందని నిమ్మల వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడంతో పాటు కరవు ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. 2019-24 మధ్యకాలంలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను మాజీ సీఎం జగన్ గాలికి వదిలేశారని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని విధ్వంసం చేస్తే, కూటమి ప్రభుత్వం చిట్టచివరి ఎకరా దాకా సాగునీరు అందించేందుకు కృషి చేస్తోందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ గాడిలో పెడుతున్నామన్నారు.