అవనిగడ్డలో నామినేటెడ్ పదవుల రచ్చ!
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:02 AM
నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజేసింది. అధికారంలోకి వచ్చిన 13 నెలల తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టిన అధిష్టానం ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో మూడు కార్పొరేషన్లకు సంబంధించి డైరెక్టర్ల భర్తీలో అవనిగడ్డ నియోజకవర్గానికి స్థానం కల్పించింది. అయితే పార్టీ నియమించిన మూడు డైరెక్టర్ పదవులు కేవలం చల్లపల్లి మండలానికే కేటాయించటంతో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న కార్యకర్తలు, నేతలు వైసీపీ అరాచకాలపై పెద్ద ఎత్తున పోరాటం జరిపారని, కానీ పదవుల భర్తీ వ్యవహారానికి వచ్చేసరికి కేవలం ఒక్క మండలానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం ఎంత వరకు సబబు అని పార్టీ నేతలు జిల్లా, రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
- ఒకే మండలానికి కేటాయించటంతో టీడీపీ శ్రేణుల ఆగ్రహం
- మిత్రపక్ష నేతలను ప్రసన్నం చేసుకున్న వారికే పదవులంటూ ఆరోపణలు
- పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి మరీ అసంతృప్తి వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు
- సోషల్ మీడియాలో పోస్టులతో.. తారాస్థాయికి వివాదం
(ఆంధ్రజ్యోతి, అవనిగడ్డ):
నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజేసింది. అధికారంలోకి వచ్చిన 13 నెలల తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టిన అధిష్టానం ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో మూడు కార్పొరేషన్లకు సంబంధించి డైరెక్టర్ల భర్తీలో అవనిగడ్డ నియోజకవర్గానికి స్థానం కల్పించింది. అయితే పార్టీ నియమించిన మూడు డైరెక్టర్ పదవులు కేవలం చల్లపల్లి మండలానికే కేటాయించటంతో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న కార్యకర్తలు, నేతలు వైసీపీ అరాచకాలపై పెద్ద ఎత్తున పోరాటం జరిపారని, కానీ పదవుల భర్తీ వ్యవహారానికి వచ్చేసరికి కేవలం ఒక్క మండలానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం ఎంత వరకు సబబు అని పార్టీ నేతలు జిల్లా, రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జిల్లా నాయకత్వం నియోజకవర్గ పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చటంలో విఫలం కావటంతో ఆరు మండలాలకు చెందిన పలువురు నేతలు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి తమ నిరసన తెలియజేశారు. పోరాటాలు చేయాల్సిన సమయంలో తాము ముందున్నామని, కానీ పదవుల భర్తీ దగ్గరకు వచ్చే సరికి స్థానికంగా ఉన్న కొందరిని ప్రసన్నం చేసుకుంటేనే గానీ పదవులు దక్కని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. టీడీపీ నేతలతో పాటు కూటమిలోని మిత్రపక్ష నేతలను కూడా ప్రసన్నం చేసుకున్న వారికి మాత్రమే పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీ వారు చెప్పిన వారికే పదవులు ఇచ్చేటట్టైతే నియోజకవర్గ ఇన్‌చార్జి పదవీ కూడా ఆ పార్టీవారికే ఇవ్వాలని చెప్పి తిరిగి వచ్చారు. కాగా, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బుద్ధప్రసాద్ చెప్పిన వారికే పదవులు వస్తున్నాయని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గడిచిన రెండు, మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తమ అసంతృప్తిని వెళ్లగక్కడం గమనార్హం.
అధికారంలోకి వచ్చినా రక్షణ లేదు
ఐదేళ్ల వైసీపీ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రక్షణ ఉండటం లేదని తెలుగుదేశం నేతలు వాపోతున్నారు. నాలుగు రోజుల క్రితం మోపిదేవి మండలానికి చెందిన ఓ టీడీపీ నేతపై వైసీపీకి చెందిన వ్యక్తులు దాడి చేశారు. గాయపడిన వారికి పోలీసులు అండగా నిలవకుండా, దాడి చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోపిదేవి మండలంలోనే గడిచిన సంవత్సరకాలంలో ఇలాంటి ఘటనలు రెండు మూడు నమోదైనప్పటికీ చర్యలు శూన్యమని మోపిదేవి పోలీస్ ేస్టషన్ వద్ద నిరసన తెలియజేశారు. పోలీసుల వ్యవహార శైలిపై జిల్లా ఎస్పీ, ఇన్‌చార్జి మంత్రి, జిల్లా పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ పోలీస్ ేస్టషన్లలో వైసీపీ వారి హవానే నడుస్తోందని ఆరోపిస్తున్నారు. అధిష్టానం వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.