Minister Achhenna: రబీలో యూరియా కొరత రాకూడదు
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:43 AM
రబీ సీజన్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ యూరియా కొరత తలెత్తకూడదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గురువారం విజయవాడ క్యాం....
‘ఆగ్రో్‌స’పై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశం
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ యూరియా కొరత తలెత్తకూడదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గురువారం విజయవాడ క్యాంప్ ఆఫీ్‌సలో వ్యవసాయ అనుబంధశాఖలపై ఆయన సమీక్ష చేశారు. ‘రబీకి అవసరమైన యూరియా ముందుగానే సమృద్ధిగా నిల్వలు పెట్టాలి. అత్యవసరమైతే బఫర్‌స్టాక్ వినియోగించుకోవాలి. రైతుసేవా కేంద్రాల్లో అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలి. జిల్లాల వారీగా నిల్వల లెక్కలు పక్కాగా ఉండాలి. జేసీలు బాధ్యత తీసుకుని, యూరియా సక్రమంగా రైతులకు అందేలా చూడాలి. అక్రమ రవాణాను అరికట్టాలి. రైతులకు విత్తనాలు సకాలంలో అందించని వారిపై చర్యలు తీసుకోవాలి’ అని స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో 20.69 లక్షల టన్నుల ఎరువులు అవసరం ఉండగా, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లో అవసరానికి సరిపడా నిల్వలున్నాయని అధికారులు చెప్పారు. గ్రోమోర్ దుకాణాల వద్ద తరచూ యూరియా సమస్యలు వస్తున్నాయని, వాటిని పరిశీలించి, పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
‘ఆగ్రో్‌సలో ఇష్టారాజ్యం’ కథనంపై స్పందన
‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 26న వచ్చిన ‘ఆగ్రో్‌సలో ఇష్టారాజ్యం’ కథనంపై మంత్రి స్పందించారు. ఏపీ ఆగ్రో్‌సపై వస్తున్న ఆరోపణలపై విజిలెన్స్‌తో దర్యాప్తు చేయించాలని వ్యవసాయశాఖ స్పెషల్ సీఎ్‌సను ఆదేశించారు. ఆగ్రోస్ ద్వారా రైతులకు సబ్సిడీపై అందించే పరికరాలు, వాహనాల విషయంలో మార్పులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు కిసాన్ డ్రోన్లపై అవగాహన కల్పించాలని సూచించారు.