MLA Balakrishna: నో అంకుల్.. ఓన్లీ బాలయ్య
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:47 AM
నో అంకుల్... ఓన్లీ బాలయ్య అంటూ టీడీఎల్పీ కార్యాలయంలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన విరామ సమయంలో...
కావలి గ్రీష్మతో బాలకృష్ణ సరదా సంభాషణ
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘నో అంకుల్... ఓన్లీ బాలయ్య’ అంటూ టీడీఎల్పీ కార్యాలయంలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన విరామ సమయంలో టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి ఆయనతో ఫొటోలు దిగారు. ‘నేను తొలిసారి అసెంబ్లీకి వచ్చాను. నన్ను ఆశీర్వదించండి అంకుల్’ అని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ... అడిగారు. బాలకృష్ణ నవ్వుతూ... ‘నో అంకుల్.. ఓన్లీ బాలయ్య’ అనడంతో నవ్వులు విరిశాయి. అఖండ-2 విడుదల ఎప్పుడని వారు ప్రశ్నించగా.. ‘ఈ నెల 25న తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమా విడుదలవుతోంది. అది బాగా ఆడాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత మా సినిమా డిసెంబరు 5న విడుదలవుతుంది.’ అని అన్నారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలని మంత్రి సంధ్యారాణి కోరగా బాలకృష్ణ సానుకూలంగా స్పందించారు.
అయోమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు: లోకేశ్
టీడీఎల్పీలో ఉన్న బాలకృష్ణను మంత్రి లోకేశ్ వచ్చి పలుకరించారు. అనంతరం అక్కడే ఉన్న మీడియాతో ఆయన మాట్లాడారు. ‘శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. జీఎస్టీ అంశంపై వారి పార్టీ అధినేతకు, నాయకులకు మధ్య సమన్వయం లేకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది’ అని లోకేశ్ అన్నారు.