Minister Lokesh: విజయానికి దగ్గరి దారి లేదు
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:01 AM
విజయానికి దగ్గరి దారి ఉండదని, అందరూ తప్పులు చేసి ముందుకెళ్తున్నారని, మనం కూడా వాటిని చేయకూడదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు.
అలా పైకి ఎదిగినా ఆ స్థానం నిలబడదు
ఓడిన చోటే భారీ మెజారిటీతో గెలిచా
నైతిక విలువలతోనే సమాజ మార్పు
విలువల సదస్సులో మంత్రి లోకేశ్
అన్ని జిల్లాల్లో సదస్సులు పెడతామని వెల్లడి
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): విజయానికి దగ్గరి దారి ఉండదని, అందరూ తప్పులు చేసి ముందుకెళ్తున్నారని, మనం కూడా వాటిని చేయకూడదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. ఒకవేళ దగ్గరి దారిలో ఎదిగినా ఆ స్థానం నిలబడదన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన ‘విలువల విద్యా సదస్సు’లో ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. ‘‘నైతిక విలువలు పాటించేవారు ఏం చేయలేకపోతున్నారనే అభిప్రాయం ఉంది. జీవితంలో ఏం సాధించారని అలాంటివారిని అడుగుతుంటారు. దీనిపై మీరేం అంటారు?.’ అని ఓ విద్యార్థి అడిగాడు. దానికి స్పందిస్తూ...తాను మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయినప్పుడు చాలా మంది అవమానించారని, తొలుత బాధపడినా, ఆ తర్వాత లోపాలు ఎక్కడున్నాయో గుర్తించి మళ్లీ అక్కడినుంచే భారీ మెజారిటీతో గెలిచానని తెలిపారు. సినిమాలు, సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా, చట్టాల కంటే కూడా మహిళలను గౌరవించడం అనేది మొదట ఇంటినుంచే మొదలవ్వాలని లోకేశ్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన... మహిళలే మహిళలను కించపరిచేలా మాట్లాడటం బాధ కలిగిస్తోందని చెప్పారు. తనకు గురువులే స్ఫూర్తి అని, పాఠశాల స్థాయిలో మంజుల టీచర్, రమామణి టీచర్, ఇంటర్మీడియట్‌లో మంత్రి పి.నారాయణ, యూనివర్సిటీలో రాజిరెడ్డి తనకు ఇష్టమైన గురువులని తెలిపారు.
ప్రజల్లోకి విలువల ప్రచారం
ఎవరైనా క్యాబినెట్ ర్యాంకు కావాలని కోరుకుంటారని, కానీ చాగంటి కోటేశ్వరరావు కనీసం తాము ఇచ్చిన కాఫీ కూడా తీసుకోలేదని, ప్రభుత్వ వాహనం వాడటం లేదని, సెల్‌ఫోన్ బిల్లు కూడా ఆయన కట్టుకుంటున్నారని లోకేశ్ తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచాలనే చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు...చాగంటి పేరు సూచించారన్నారు. ఆయన మార్గనిర్దేశంలో విలువల సాధన కోసం పనిచేస్తున్నామని తెలిపారు. విలువల విద్యా సదస్సులను ఇకపై అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని, ఆ తర్వాత ప్రజల కోసం నియోజకవర్గాల స్థాయిలో కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. సినిమాలు, వెబ్ సిరీ్‌సల్లో మహిళలను కించపరిచే డైలాగులు లేకుండా ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మాట్లాడానని అన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఉన్నతాధికారులు కోన శశిధర్, వి.విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.