Supreme Court Ruling Affecting: పింఛన్‌కు సర్వీస్ బ్రేక్ అడ్డు కాదు
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:58 AM
రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది.
ఏపీ ‘విభజన’ ఉద్యోగులకు సుప్రీంలో స్వల్ప ఊరట
పనిచేయని కాలానికి జీతం చెల్లింపునకు మాత్రం నిరాకరణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఉద్యోగంలో చేరడంలో జరిగిన సర్వీస్ బ్రేక్ అనేది పింఛన్ ప్రయోజనాలకు అడ్డంకి కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అయితే, పనిచేయని కాలానికి జీతం ఇవ్వాలనే విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ‘నో వర్క్-నో పే’ సూత్రం వర్తిస్తుందని తెలిపింది. పిటిషన్‌ను కొట్టివేసింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కొందరు ఉద్యోగులను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. తెలంగాణలో పదవీ విరమణ వయసు 58 ఏళ్లకు కుదించగా, ఏపీలో 60 ఏళ్లు అమలులో ఉంది. కొందరిని ఏపీలో మళ్లీ విధుల్లోకి తీసుకునే క్రమంలో కొంత పాలనాపర జాప్యం జరిగింది. తెలంగాణ నుంచి రిలీవై ఏపీలో ఉద్యోగంలో చేరిన సమయానికి మధ్య కొన్ని నెలల అంతరం ఏర్పడింది. ఈ ఖాళీ కాలాన్ని సర్వీసుగా పరగణించి, పూర్తికాల వేతనం చెల్లంచాలని కోరుతూ ఈశ్వరయ్య, మరికొందరు ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి ధర్మాసనం సోమవారం ఆ పిటిషన్‌ను విచారించింది. ఇరుపక్షాల వాదనల అనంతరం.. ఉద్యోగుల పింఛన్ లెక్కింపు కోసం సర్వీస్ కొనసాగినట్టు పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనివల్ల 60 ఏళ్ల సర్వీ్‌సకు పూర్తి పింఛన్ ప్రయోజనాలు పొందుతారని తెలిపింది. ఆ ప్రయోజనం పొందాలంటే.. ఖాళీ సమయంలో తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు నిరూపించే ఏదైనా పత్రం ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.