Share News

మూణ్నెళ్లుగా జీతాల్లేవ్‌!

ABN , Publish Date - Oct 09 , 2025 | 01:15 AM

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అధికారుల నిర్లక్ష్యం ఉద్యోగులకు శాపంగా మారింది. జీతాలు, ఇతర సప్లిమెంటరీ బిల్లులు అందక మూడు నెలలుగా జీతాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బిల్లులపై సకాలంలో సంతకాలు, ఆన్‌లైన్‌లో వేలిముద్ర వేయాల్సిన కమిషనర్‌ పట్టించుకోవడ ం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

మూణ్నెళ్లుగా జీతాల్లేవ్‌!

- బిల్లులు పెండింగ్‌ పెట్టిన మచిలీపట్నం కార్పొరేషన్‌ అధికారులు

- తీవ్ర ఇబ్బందులు పడుతున్న వార్డు సచివాలయ ఉద్యోగులు

- కార్పొరేషన్‌ కార్యాలయ సిబ్బందికి తప్పని ఆర్థిక అవస్థలు

- బిల్లులు క్లియర్‌ చేయడంలేదని కమిషనర్‌పై ఆగ్రహం

- జిల్లా ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేడుకోలు

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అధికారుల నిర్లక్ష్యం ఉద్యోగులకు శాపంగా మారింది. జీతాలు, ఇతర సప్లిమెంటరీ బిల్లులు అందక మూడు నెలలుగా జీతాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బిల్లులపై సకాలంలో సంతకాలు, ఆన్‌లైన్‌లో వేలిముద్ర వేయాల్సిన కమిషనర్‌ పట్టించుకోవడ ం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

ఇటీవల కాలంలో వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీలు జరిగాయి. 15 రోజుల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రక్రియను రెండు నెలల పాటు సాగదీశారు. దీంతో సచివాలయ సిబ్బంది ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. మునిసిపల్‌ కార్యాలయ అధికారులు, కూటమి నాయకులు తమ చిత్తానుసారంగా సచివాలయ సిబ్బందికి సంబంధించిన బదిలీల జాబితాలను పలుమార్లు తయారు చేసి ఇవ్వడంతో ఈ వ్యవహారంలో గందరగోళం ఏర్పడింది. బదిలీల ప్రక్రియ కుదుటపడటానికి రెండు నెలల సమయం పట్టింది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత జీతాల బిల్లులు చేయడంలోనూ జాప్యం జరిగింది. మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో 50 డివిజన్‌లు ఉండగా, వాటిలో కనీసంగా 500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరితో పాటు మునిసిపల్‌ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు 60 నుంచి 70 మందికి జీతాలను చెల్లించకుండా తొక్కిపెట్టారని ఉద్యోగులు చెబుతున్నారు. జీతాల బిల్లులు, ఇతరత్రాలకు చెందిన బిల్లులు చేసి కమిషనర్‌ వద్దకు సంబంధితశాఖ విభాగం సిబ్బంది తీసుకువెళితే వేలిముద్ర వేయకుండా కమిషనర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మునిసిపల్‌ కార్యాలయ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది వాపోతున్నారు. ఇటీవల కాలంలో సచివాలయ సిబ్బంది పదోన్నతులు, ఇతరత్రా డిమాండ్‌లు నెరవేర్చాలని కోరుతూ వారి యూనియన్‌ ద్వారా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల అధికారిక వాట్సాప్‌ గ్రూపు నుంచి కొందరు సచివాలయ సిబ్బంది నిష్క్రమించారు. తాము వాట్సాప్‌ గ్రూపు నుంచి వారం రోజుల క్రితం బయటకు వెళితే, గత మూడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వకుండా జాప్యం చేసి, వాట్సాప్‌ గ్రూపు నుంచి బయటకు వెళ్లడంతోనే మీకు జీతాలు నిలిపామనే సాకును చూపుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

జీతాలు పెండింగ్‌లో పెట్టడం నిజమే

సచివాలయ సిబ్బంది కొందరు మునిసిపాలిటీకి చెందిన అధికారిక వాట్సాప్‌గ్రూపు నుంచి నిష్క్రమించారు. దీంతో పరిపాలనాపరంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారిక వాట్సాప్‌గ్రూపులో చేరితే జీతాలు బిల్లులు చేస్తామని సిబ్బందికి చెప్పడం జరిగింది. కానీ వారు తమ యూనియన్‌ నాయకుల సూచనల మేరకు వాట్సాప్‌ గ్రూపులో చేరలేదని చెబుతున్నారు. గతంలో నేను సంతకాలు చేసిన బిల్లులు కొన్నింటికి ఇంకా అనుమతులు రాలేదు. దీంతో కొన్ని బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

-బాపిరాజు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌

Updated Date - Oct 09 , 2025 | 01:15 AM