Share News

Fertilizer Supply Crisis: యూరియా.. సమస్య ఎందుకయా

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:34 AM

యూరియా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అవసరానికి మించి ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తోంది. ఖరీఫ్‌ అవసరాలను దృష్టిలో...

Fertilizer Supply Crisis: యూరియా.. సమస్య ఎందుకయా

  • ఆందోళన వద్దంటున్న ప్రభుత్వంఅవసరానికి సరిపడా ఎరువులు

  • ఒక్కసారిగా పెరిగిన వినియోగం

  • రబీ సీజన్‌కూ ఇప్పుడే కొనుగోళ్లు

  • సమస్యకు అదే కారణమని విశ్లేషణ

  • జిల్లాల వారీగా పర్యవేక్షణ

అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అవసరానికి మించి ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తోంది. ఖరీఫ్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ప్రణాళిక ప్రకారం ఎరువులను సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత సీజన్‌ అవసరాలకు అంచనాకు మించి 83వేల టన్నుల యూరియా అదనంగా అందుబాటులోకి తెస్తున్నట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. కొందరు రైతులు అవసరానికి మించి యూరియాను వినియోగిస్తున్నారని, దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. గతేడాది ఖరీఫ్‌ కంటే ప్రస్తుత సీజన్‌లో ఎక్కువగానే ఎరువులు సరఫరా చేశామని చెప్తున్నారు. గత ఖరీ్‌ఫలో 8.76.928 టన్నుల ఎరువులు వాడగా, ఈ ఏడాది ఇప్పటికే 10.96.239 టన్నులు వినియోగించారు. ఖరీఫ్‌ పంటలతో పాటు రానున్న రబీ సీజన్‌కూ ఇప్పుడే ఎరువులు కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో వేసిన పంటల అవసరాలకు మాత్రమే తగిన యూరియా కొనుగోలు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. వ్యవసాయేతర అవసరాలకు మళ్లించొద్దని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో యూరియా, డీఏపీ, ఇతర ఎరవులు కొరత లేకుండా నిఘా పెట్టాలని విజిలెన్స్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.


ఢిల్లీ నుంచి సీఎం సమీక్ష

సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తంగా ఉండి, ఎరువులు దారి మళ్లకుండా, ధర పెరగకుండా చూడాలని సూచించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, దారి మళ్లించినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో ఎరువుల సరఫరాపై నిత్యం ట్రాకింగ్‌ పెట్టి, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే వారిపై కేసులు పెట్టాలని కలెక్టర్లను సీఎస్‌ విజయానంద్‌ ఆదేశించారు.

యూరియా దుకాణాల్లో విజిలెన్స్‌ తనిఖీలు

రాష్ట్రంలోని ఎరువుల గోదాములు, హోల్‌సేల్‌ డీలర్లు, రిటైల్‌ షాపుల్లో విజిలెన్స్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. యూరియా అక్రమ నిల్వ, దారి మళ్లింపుపై సమాచారాన్ని సమీపంలోని విజిలెన్స్‌ కార్యాలయానికి తెలియజేయాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హరీశ్‌కుమార్‌ గుప్తా కోరారు.


యూరియా సమస్య తక్షణ పరిష్కారానికి చర్యలు

వ్యవసాయ మంత్రి అచ్చెన్న ఆదేశం

అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా సరఫరాలో సమస్యను గుర్తించి, రైతులకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరా, లభ్యతలో రైతులకు తప్పుడు సందేశం వెళ్లకుండా చూడాలన్నారు. యూరియా సమస్యపై సీఎస్‌, డీజీపీ, విజిలెన్స్‌, ఇంటెలిజెన్స్‌ డీజీలు, సీఎంవో అదనపు కార్యదర్శి, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సహా జిల్లా కలెక్టర్లు, జేసీలు, డీఏవోలతో శుక్రవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘ఖరీఫ్‌ అవసరాల కన్నా కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్రానికి యూరియా ఎక్కువే కేటాయించినా క్షేత్రస్థాయిలో రైతులకు పంపిణీలో చాలాచోట్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పంపిణీ యాజమాన్యం సరిగ్గా లేకపోవడం వల్ల యూరియాపై ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా తప్పుడు ప్రచారం జరుగుతోంది. మార్క్‌ఫెడ్‌, ప్రైవేట్‌ వ్యాపారులకు ప్రస్తుతమున్న 50:50నిష్పత్తిని 70:30నిష్పత్తిలో ఉండేలా చూడాలి. వ్యవసాయేతర అవసరాలకు యూరియా మరలకుండా గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ, పోలీస్‌, రెవెన్యూ, పరిశ్రమలు, ఇతర శాఖలతో సంయుక్త పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టాలి. మార్క్‌ఫెడ్‌ బఫర్‌ స్టాక్‌ నుంచి గ్రామ స్థాయిలోని రైతు సేవా కేంద్రాలకు సకాలంలో ఎరువులను సరఫరా చేయాలి’ అని ఆదేశించారు. రానున్న రబీ సీజన్‌ కోసం రైతులు కూడా ఇప్పటి నుంచే యూరియా కొనుగోలు చేయవద్దని అచ్చెన్న విజ్ఞప్తి చేశారు. వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ రాబోవు రోజుల్లో యూరియా సరఫరాలో ఇబ్బందులంటాయనే తప్పుడు ప్రచారంతో రైతులు అవసరం కన్నా అధికంగా కొనుగోలు చేసి, నిల్వ చేస్తున్నారని తెలిపారు. సీఎస్‌ విజయానంద్‌ మాట్లాడుతూ యూరియాను దారిమళ్లించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా మాట్లాడుతూ మాట్లాడుతూ జిల్లాల్లో ఎరువుల సరఫరాపై హెల్ప్‌లైన్‌ నంబర్లతో ప్రచారం చేయాలని సూచించారు.


బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టాలి: సీపీఐ

ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టి రైతులకు సక్రమంగా సరఫరా చేసేలా తగు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. యూరియాపై రూ.100, డీఏపీపై రూ 200 చొప్పున అదనంగా వసూలుచేస్తూ బ్లాక్‌లో అమ్ముతుంటే.. ప్రభుత్వ అధికారులు, విజిలెన్స్‌ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 23 , 2025 | 04:36 AM