Health Dept Group-1 Officers: మాకు పదోన్నతులు లేవా
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:06 AM
ఆరోగ్యశాఖలో పదోన్నతులు అందని ద్రాక్షలా మారాయి..! ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిప్యూటీ డైరెక్టర్ల(డీడీ)కు అతి కష్టంమీద జాయింట్ డైరెక్టర్లు (జేడీ)గా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఏళ్ల తరబడి డీడీలుగానే ఉన్నాం
హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు మాకే ఇవ్వాలి
ఆరోగ్యశాఖలో గ్రూప్-1 అధికారుల డిమాండ్
అమరావతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖలో పదోన్నతులు అందని ద్రాక్షలా మారాయి..! ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిప్యూటీ డైరెక్టర్ల(డీడీ)కు అతి కష్టంమీద జాయింట్ డైరెక్టర్లు (జేడీ)గా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే... జేడీ స్థాయి పోస్టులు దాదాపు 15 ఉన్నా.. కేవలం 8 మందికే పదోన్నతి కల్పిస్తుండడంతో.. మిగిలిన వారు తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ నుంచి అధికారులను తీసుకొచ్చేందుకు చూపించే శ్రద్ధ.. ఆరోగ్యశాఖలోనే విధులు నిర్వహిస్తున్న గ్రూప్-1 అధికారులకు పదోన్నతులు కల్పించే విషయంలో చూపించడం లేదని విమర్శిస్తున్నారు.
పోస్టులు లేక డీడీలుగానే...
ప్రస్తుతం ఆరోగ్యశాఖలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు 88, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 42, డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు 11, జాయింట్ డైరెక్టర్ పోస్టులు 2, అడిషనల్ డైరెక్టర్ పోస్టులు 3 ఉన్నాయి. వాస్తవానికి కనీసం 21 డిప్యూటీ డైరెక్టర్, 11 జాయింట్ డైరెక్టర్, 5 అడిషనల్ డైరెక్టర్ పోస్టులు ఉండాలి. కానీ పై కేడర్ పోస్టులు తక్కువ ఉండడంతో కొంతమంది 18 ఏళ్ల నుంచి డీడీలుగానే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా 13 మంది డీడీలకు జేడీలుగా పదోన్నతి కల్పించేందుకు అవకాశం ఇచ్చింది. కానీ ఆరోగ్యశాఖ మాత్రం 8 మందికే జేడీలుగా పదోన్నతి కల్పిస్తోంది. దీంతో మరో ఐదుగురు డీడీలు పదోన్నతికి దూరమవుతున్నారు. వీరికి పదోన్నతులిచ్చేందుకు పోస్టులు లేవా అంటే.. ఆరోగ్యశాఖలో జేడీ స్థాయి పోస్టులు దాదాపు 15 ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లో ఉన్న అడిషనల్ డైరెక్టర్ పోస్టుల్లో రెండింటిని జేడీ పోస్టులుగా మార్చారు. అలానే నేషనల్ హెల్త్ మిషన్‌లో ఎస్‌పీఎం (స్టేట్ ప్రోగామ్ ఆఫీసర్), సీఏవో (చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్), అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) నోడల్ అధికారి పోస్టులు రెండు, నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) స్పెషల్ జాయింట్ డైరెక్టర్‌తో పాటు భ్రూణహత్యల నివారణ చట్టం (పీసీపీ అండ్ డీటీ యాక్ట్) జాయింట్ డైరెక్టర్‌తో కలిపి 8 పోస్టులు మాత్రమే చూపిస్తున్నారు. ఇవికాకుండా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)లో మూడు పోస్టులు, సెకండరీ హెల్త్ డైరెక్టరేట్‌లో సెక్రటరీ పోస్టు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌లో రెండు అడిషనల్ డైరెక్టర్ పోస్టులను కూడా జేడీ కేడర్‌లో భర్తీ చేసే అవకాశం ఉంది. కానీ.. ఆరోగ్యశాఖ మాత్రం 8 మందికే పదోన్నతి కల్పిచేందుకు సన్నాహాలు చేస్తోంది.
సిబ్బంది అవసరాన్ని గుర్తించే నిర్ణయం: కృష్ణబాబు
ఆరోగ్యశాఖలో పదోన్నతులకు అవకాశాలు లేకపోవడం వల్ల పరిపాలనా సిబ్బంది ఎందుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 6 జాయింట్ డైరెక్టర్ పోస్టులను సృష్టించాలని నిర్ణయించిందని ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు చెప్పారు. అలాగే ఖాళీగా ఉన్న అడిషనల్ డైరెక్టర్ల పోస్టులను జాయింట్ డైరెక్టర్లతో భర్తీ చేయాలని నిర్ణయించిందని తెలిపారు. కేడర్ అవసరం గురించి ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఉందని, భవిష్యత్తులో మరింత మంది సిబ్బంది ఆకాంక్షలను నెరవేరుస్తామని కృష్ణబాబు పేర్కొన్నారు.
ఆరోగ్యశాఖలో రెవెన్యూ సిబ్బంది..
ఆరోగ్యశాఖ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీల్లో హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేటర్స్ పేరుతో 11 పోస్టులు సృష్టించారు. వాటిని రెవెన్యూ అధికారులతోనే భర్తీచేసేలా గత వైసీపీ ప్రభుత్వంలో జీవోలు జారీ చేశారు. దీనిపై ఆరోగ్యశాఖలోని గ్రూప్-1 అధికారులు తొలి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జేడీ పదోన్నతుల అంశం తెరపైకి రావడంతో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ పోస్టులను ఆరోగ్యశాఖలోని అధికారులతో భర్తీ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీల్లో ఉన్న హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేటర్స్ పోస్టుల్లో విశాఖలోని కేజీహెచ్, కాకినాడ రంగరాయ, విజయవాడ సిద్ధార్థ, గుంటూరు మెడికల్ కాలేజీ, తిరుపతి శ్రీ వెంకటేశ్వర కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీల్లో పోస్టులను ఆరోగ్యశాఖలోని జేడీలతో భర్తీ చేయాలని, అనంతపురం, కడప, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాకుళం మెడికల్ కాలేజీల్లో హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేటర్స్ పోస్టులను డీడీలతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పోస్టులను జేడీ, డీడీలుగా మార్చడం వల్ల ఆరోగ్యశాఖలో పోస్టులు పెరిగి, గ్రూప్-1 అధికారులకు పదోన్నతులు రావడంతో పాటు ప్రతి కేడర్ పోస్టులు కింద కేడర్‌లో సగం ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.