Panchayat reorganization: పంచాయతీల పునర్విభజనఇప్పట్లో లేనట్లే!
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:26 AM
మున్సిపల్ శాఖకు సంబంధించి గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడలే కాకుండా.. పంచాయతీరాజ్ శాఖలో గ్రామ పంచాయతీల పునర్విభజన కూడా ఇప్పుడు సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు.
ఏప్రిల్ 2 దాకా ప్రస్తుత పాలక వర్గాలు
ఈలోపు మార్పులకు అవకాశం లేదు
పైగా జనవరి 2 నుంచి జనగణన ప్రక్రియ
సెన్సస్ కమిషనర్ అనుమతితోనే చేపట్టడానికి ఆస్కారం
ఇప్పటికే గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడపై నిర్ణయం
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ శాఖకు సంబంధించి గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడలే కాకుండా.. పంచాయతీరాజ్ శాఖలో గ్రామ పంచాయతీల పునర్విభజన కూడా ఇప్పుడు సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ప్రారంభమవుతున్నందున ఈ లోపు పంచాయతీల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ భావించి దానిని చేపట్టింది. పునర్విభజనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలని భారీస్థాయిలో విజ్ఞప్తులు అందాయి. ఇప్పటికే సుమారు 150 గ్రామ పంచాయతీలను విభజించాలని, విలీనం చేయాలని, పునర్విభజన చేయాలంటూ పలు ప్రతిపాదనలు పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు చేరాయి. వాటన్నిటినీ కమిషనర్ కార్యాలయం సోమవారం నాటికి ప్రభుత్వానికి చేర్చనుంది. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన చట్ట సవరణ 274(ఏ) ప్రకారం గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు ఉన్నంత కాలం వాటి సరిహద్దులు మార్చరాదు. ఇదే ప్రస్తుతం పునర్విభజన ప్రక్రియకు అడ్డంకిగా మారిందని అంటున్నారు. ఆ పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ఆ తర్వాత పునర్విభజన ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. అయితే అది చేయాలంటే జనగణన అమల్లో ఉన్నందున సెన్సస్ కమిషనర్ అనుమతితో చేపట్టాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను ఎలాగూ ఏప్రిల్ నాటికి నిర్వహించదు. కొంత కాలం తర్వాత అంటే.. ఏప్రిల్లో నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభిస్తే.. జూన్, జూలైలో ఎన్నికలు నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది.
తాను తెచ్చిన చట్టానికి తానే తూట్లు..: పంచాయతీ పాలకవర్గాలు ఉన్నంతకాలం భౌగోళికమార్పులు చేపట్టరాదంటూ వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ చట్టంలోని 274 (ఏ)కు 2022లో చట్ట సవరణ చేశారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లోనూ మున్సిపల్ శాఖ ద్వారా చట్ట సవరణ చేశారు. అయితే అదే ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లకు సమీపంలో ఉన్న పలు పంచాయతీలను విలీనం చేసింది. దీంతో ఆయా పంచాయతీలు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియను నిలిపేసింది. తాజాగా మున్సిపల్ మంత్రి హైకోర్టు అడ్వకేట్ జనరల్ సలహాతో గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ ప్రక్రియను వాయిదా వేశారు. పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్2దాకా ఉన్నందున ఇప్పుడు పంచాయతీల పునర్విభజన చేపడితే చట్టవిరుద్ధమవుతుందని న్యాయనిపుణులు సూచించారు. దీంతో ఆ ప్రక్రియ ఇప్పట్లో లేనట్లేనని అధికారులు చెబుతున్నారు.