BJP AP Chief P.V.N. Madhav: లిక్కర్ స్కాంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలేది లేదు
ABN , Publish Date - Aug 08 , 2025 | 05:26 AM
లిక్కర్ స్కాంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు.
నాసిరకం లిక్కర్‌తో ప్రజల జీవితాలతో చెలగాటం
ఒంగోలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): లిక్కర్ స్కాంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటమే కాకుండా భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒంగోలులో వచ్చిన మాధవ్ విలేకరులతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా.. ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే పోలీసులు, అధికారుల అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో ఆయన కారు కింద ఒక దళితుడు పడి మృతిచెందినా పట్టించుకోలేదన్నారు. జగన్ ఇదేవిధంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఏడాదిలో రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడులు
కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మాధవ్ తెలిపారు. రానున్న రోజుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ట్రంప్ చర్యల వల్ల అమెరికాకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మనకు తాత్కాలిక ఇబ్బంది కలిగినా మేకిన్ ఇండియాలో భాగంగా దేశం గొప్ప అభివృద్ధి సాధిస్తుందన్నారు. నాణ్యమైన పొగాకుకు ప్రకాశం జిల్లాకు పెట్టింది పేరు అని, అయితే మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపైనా దృష్టిసారించాలన్నారు. పొగాకు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు అదనపు ఉత్పత్తిపై అపరాధ రుసుం తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. శనగల దిగుమతిపై నియంత్రణ ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా దామాషా ప్రకారం ఇస్తున్నారన్నారు. రాహుల్‌కు పరిపక్వత లేదు. ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పూర్తి నిరాధారమని, ఆయనకు పరిపక్వత లేదని మాధవ్ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై కర్ణాటక ఈసీ స్పందించి ఆధారాలు ఉంటే సమర్పించాలని, లేదంటే ఉపసంహరించుకోవాలని హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సూర్య కళ్యాణ్‌చక్రవర్తి, మాజీ అధ్యక్షుడు పీవీ శివారెడ్డి, యోగయ్య యాదవ్, ఈదర మోహన్‌బాబు, శిరసనగండ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.