Share News

CM Chandrababu: ఎరువుల కోసం ఆందోళన వద్దు

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:09 AM

రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిమాండ్‌ కన్నా అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

CM Chandrababu: ఎరువుల కోసం ఆందోళన వద్దు

  • రసాయన ఎరువులు, పురుగు మందులు

  • తక్కువగా వాడే రైతులకు రాయితీలు

  • 11 రకాల ఉద్యాన పంటలకు కనీస ధర: సీఎం

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిమాండ్‌ కన్నా అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉండవల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, ఉల్లి కొనుగోలు తదితర అంశాలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ-క్రాప్‌ ద్వారా రాష్ట్రంలో ఎంత మేరకు, ఏ పంటలు సాగవుతున్నాయో, ఎరువులు వినియోగం ఎంత జరుగుతున్నదో లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలన్నారు. ఈ సీజన్‌లో 2.02 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయ్యిందని, వాస్తవ డిమాండ్‌ కన్నా అదనంగా నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్పారు. గతంతో పోల్చితే ఈసారి 91 వేల టన్నుల యూరియా అదనంగా వచ్చిందని, డీఏపీ 16వేల టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 1.20లక్షల టన్నులు అదనంగా వచ్చాయని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. రాష్ట్రంలో ఎరువుల లభ్యత ఇంతగా ఉన్నా.. కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రసాయన ఎరువులు, పురుగు మందుల రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని అధికారులకు నిర్ధేశించారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు రాయితీలు ఇచ్చే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రైతుసేవా కేంద్రాల ద్వారా కూడా గణాంకాలు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలోని 11 ఉద్యాన పంటలకు కనీస ధర వచ్చేలా చూడాలని ఆదేశించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోవటానికి వీల్లేదన్నారు. మరోవైపు కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన బెర్రీ బోరర్‌ తెగులుపై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.


కొత్త తెగులు వచ్చిన కాఫీ పంట 20 ఎకరాల్లోనే ఉంటుందని, దానిని తక్షణమే తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పగా, తొలగించిన పంటకు నష్ట పరిహారం చెల్లించి, రైతులను ఆదుకోవాలని సీఎం సూచించారు. ఇతర ప్రాంతాలకు తెగులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు ఉల్లి పంట మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందిగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు చేసిన ఉల్లిని స్థానికంగా కమ్యూనిటీ హాళ్లలో ఆరబెట్టాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులకు సూచించారు. ఇప్పటివరకు హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలుకు సంబంధించి రూ.54కోట్లు చెల్లింపులు జరిగాయని, మరో రూ.59కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్‌ విజయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 04:11 AM