Supreme Court: ఆర్థిక నేరాల కేసుల్లో ఎఫ్‌ఐఆర్ దశలో షోకాజ్ ఇవ్వక్కర్లేదు
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:18 AM
ఆర్థిక నేరాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ దశలో షోకాజ్ నోటీసు ఇవ్వాలన్న నిబంధనేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
నోటీసులివ్వలేదన్న కారణంతో కేసును కొట్టివేయలేం: సుప్రీం
రఘురామరాజు, నారాయణరెడ్డికి ధర్మాసనం స్పష్టీకరణ
బ్యాంకులు పెట్టిన కేసులో విచారణ ముగింపు
న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక నేరాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ దశలో షోకాజ్ నోటీసు ఇవ్వాలన్న నిబంధనేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయడం(కొట్టివేయడం) కుదరదని తేల్చిచెప్పింది. దీంతో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలకు నిరాశే ఎదురైంది. ‘రఘురామకృష్ణరాజు థర్మల్ పవర్ కంపెనీ స్థాపిస్తామని బ్యాంకుల నుంచి రూ.974 కోట్లు రుణం తీసుకున్నారు. ఇన్డ్-భారత్ కంపెనీ పేరుతో రుణాలు సేకరించారు. కానీ వాటిని కంపెనీ కోసం ఖర్చు చేయకుండా.. ఇతర బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్లను తనఖా పెట్టి రఘురామ మళ్లీ రుణం తీసుకున్నారు’ అని ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డిపై బ్యాంకులు అభియోగాలు మోపాయి. ఆయా బ్యాంకులు గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు కొనసాగుతోంది. తమపై ఎఫ్‌ఐఆర్‌లను క్వాష్ చేయాలని కోరుతూ రఘురామ, నారాయణరెడ్డి 2022 ఆగస్టు 26న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. క్రిమినల్ చర్యలు ప్రారంభించేటప్పుడు లేదా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే సమయంలో నిందితులకు ముందస్తు వివరణకు అవకాశం కల్పించాల్సిన అవసరం లేదన్నారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ... తమకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీసు ఇవ్వలేదని, తమ వాదన వినకుండానే కేసులు పెట్టారని తెలిపారు. హైకోర్టులో ఇంకా తుది తీర్పు రాలేదన్నారు. ఫ్రాడ్ డిక్లరేషన్ వల్లే ఎఫ్‌ఐఆర్ వేశారని.. దానిని కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనల తర్వాత.. ఖాతాను ఫ్రాడ్‌గా ప్రకటించే ముందు బ్యాంకులు ‘ఆడి అల్టెరమ్ పార్టెమ్ (ప్రత్యర్థి వాదన వినడం)’ అనే సూత్రాన్ని పాటించాలని.. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే దశలో అది వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందు నిందితుడికి షోకాజ్ నోటీసు ఇవ్వాలన్న నిబంధనేమీ లేదని వ్యాఖ్యానించింది. అయితే బ్యాంకులు ఇచ్చిన ఫ్రాడ్ డిక్లరేషన్, ఎఫ్‌ఐఆర్‌లోని ఇతర అంశాలపై ఏమైనా అభ్యంతరాలుంటే కింది కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. మెరిట్స్ ఆధారంగా అక్కడ వాదనలు వినిపించే స్వేచ్ఛ పిటిషనర్లకు ఉంటుందని చెబుతూ.. కేసు విచారణను ముగించింది.