లెస్ టెండర్లు వద్దు
ABN , Publish Date - May 20 , 2025 | 12:02 AM
నగరంలో నగర పాలక అభివృద్ధి పనులకు సంబంధించి లెస్ టెండర్లు వస్తే సహించేది లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత కాంట్రాక్టర్లను హెచ్చరించారు.
అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడేదిలేదు
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత
అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష
కర్నూలు న్యూసిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): నగరంలో నగర పాలక అభివృద్ధి పనులకు సంబంధించి లెస్ టెండర్లు వస్తే సహించేది లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత కాంట్రాక్టర్లను హెచ్చరించారు. టెండర్లను దక్కించుకున్న వారు పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం కర్నూలు కౌన్సిల్ హలులో కమిషనర్ రవీంద్రబాబు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కాంట్రాక్టర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా కాంటాక్టర్లు చేపట్టిన పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. కొందరు పనులు మధ్యలో ఆపేసారని... మరి కొందరు ఇప్పటి వరకు ఎందుకు పనులు ప్రారంభించలేదని ప్రశ్నించారు. తక్కువ కోట్‌కు వర్క్‌లు దక్కించుకుంటే పనుల్లో నాణ్యత ఎలా వస్తుందని మంత్రి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం జవాబుదారీతనంతో పని చేస్తుందని, ప్రజలకు మంచి పాలన అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తమకు చెడ్డపేరు తీసుకువచ్చేలా పని చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కొందరు కాంట్రాక్టర్లు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఇదంతా తాను గమనిస్తున్నట్లు చెప్పారు. కావాలనే పనులు చేయకుండా జాప్యం చేసే వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతమాన్నారు. తాను రాజకీయం చేస్తే తట్టుకోలేరని మంత్రి హెచ్చరించారు. నెలాఖరులోగా అన్ని పనులు ప్రాంభించాలని, పనులు సకాలంలో పూర్తి కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజుల ముందుగానే 42 మంది కాంట్రాక్టర్లను సమావేశానికి పిలిస్తే 18 మంది గైర్హాజరు కావడంపై మంత్రి భరత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరు రాలేదో వారి వివరాలను తనకు పంపాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ సత్యనారాయణ, డీఈఈలు మనోహర్‌రెడ్డి, క్రిష్ణలత, శ్రీనివాసరెడ్డి, గంగాధర్, నరేష్, గిరిరాజు, ఏఈలు పాల్గొన్నారు.