Share News

ఇక విత్తన కష్టాలు!

ABN , Publish Date - May 16 , 2025 | 12:39 AM

ఖరీఫ్‌ సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. రుతుపవనాలు ముందస్తుగానే వస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. సకాలంలో వర్షాలు కురిసి వాతావరణం సాగుకు అనుకూలంగా మారితే జూన్‌ రెండో వారం నుంచి జూలై రెండో వారంలోగా వరి నారు మడులు పోసుకునేందుకు అవకాశం ఉంటుంది. వ్యవసాయశాఖ ద్వారా వరి విత్తనాలు కావాలని ఇప్పటికే రైతులు ఇండెంట్‌ పెట్టారు. అయితే ఎంత మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచుతారనే అంశంపై అనేక అనుమానాలున్నాయి. ఈ ఏడాది కూడా రైతులకు విత్తన కష్టాలు తప్పేటట్టులేవు.

ఇక విత్తన కష్టాలు!

- ఖరీఫ్‌లో వరి సాగు అంచనా 1,62,123 హెక్టార్లు

- కావాల్సిన విత్తనాలు 1.03 లక్షల క్వింటాళ్లు

- ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చేది 11,600 క్వింటాళ్లే!

- మిగిలిన విత్తనాలకు ప్రైవేటు వ్యాపారులే దిక్కు

- విత్తనాల ధర క్వింటా రూ.3,250 నుంచి రూ.3,800

ఖరీఫ్‌ సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. రుతుపవనాలు ముందస్తుగానే వస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. సకాలంలో వర్షాలు కురిసి వాతావరణం సాగుకు అనుకూలంగా మారితే జూన్‌ రెండో వారం నుంచి జూలై రెండో వారంలోగా వరి నారు మడులు పోసుకునేందుకు అవకాశం ఉంటుంది. వ్యవసాయశాఖ ద్వారా వరి విత్తనాలు కావాలని ఇప్పటికే రైతులు ఇండెంట్‌ పెట్టారు. అయితే ఎంత మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచుతారనే అంశంపై అనేక అనుమానాలున్నాయి. ఈ ఏడాది కూడా రైతులకు విత్తన కష్టాలు తప్పేటట్టులేవు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్ల్లా వ్యాప్తంగా 1,62,123 హెక్టార్లలో వరి సాగు జరగనుందని వ్యవసాయశాఖ అంచనా. ఎకరానికి కనీసంగా 25 కిలోల విత్తనాలను నారు మడులుగా పోస్తారు. వ్యవసాయశాఖ ద్వారా 11,600 క్వింటాళ్ల వరి విత్తనాలను క్వింటాకు రూ.500 సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించారు. 1.03 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవససరం కాగా, ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే విత్తనాలు మినహా సుమారుగా 90 వేల క్వింటాళ్ల విత్తనాలను బహిరంగ మార్కెట్‌లో రైతులు కొనుగోలు చేయాల్సి ఉంది. వ్యవసాయశాఖ ద్వారా బీపీటీ 5204, ఎంటీయూ 1061, ఎంటీయూ 1318 వంటి రకాల వరి విత్తనాలను అందించాలని నిర్ణయించారు. చెరకు 3,549 హెక్టార్లలో, మినుము 1,340 హెక్టార్లలో, వేరుశెనగ 724 హెక్టార్లలో, పత్తి 298 హెక్టార్లలో, ఇతర పంటలు 133 హెక్టార్లలో సాగు చేయనున్నారు. చెరకు మినహా మిగిలిన రకాల పంటలకు సంబంధించిన విత్తనాలను రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్దనే కొనుగోలు చేయాలి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భూమి పరిస్థితులు, భూసారం, పంట సాగు చేసే సమయాన్ని బట్టి ఆయా గ్రామాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో ఏ రకం వరి వంగడాలను సాగు చేయాలనే అంశంపై వ్యవసాయశాఖ ముందస్తుగానే ప్రణాళికను తయారు చేసి రైతులకు తెలియజేస్తూ ఆర్‌ఎస్‌కేల వద్ద, ప్రధాన కూడళ్లలో గోడలపై రాస్తారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం విత్తనాల ధర కిలోకు రూ.32 నుంచి రూ.38 వరకు ఉంటుందని అంచనా.

కరీంనగర్‌, వరంగల్‌, గోదావరి జిల్లాల నుంచి వరి విత్తనాలు

తెలంగాణలోని కరీంనగర్‌, వరంగల్‌, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రైవేటు వ్యాపారులు అధికంగా వరి విత్తనాలను దిగుమతి చేసుకుంటారు. ఇందులో సర్టిఫైడ్‌, నాన్‌ సర్టిఫైడ్‌ విత్తనాలు ఉంటాయి. సర్టిఫైడ్‌ విత్తనాలయితే రైతులకు క్వింటాకు అసలు ధర కన్నా రూ.200 అధికంగా ధరను పెంచి విక్రయిస్తారు. విత్తనాల సంచిపై లేబుల్‌ ఉంటుంది. నాన్‌ సర్టిపైడ్‌ విత్తనాలను కొంత మేర ధర తగ్గించి విక్రయిస్తారు. ఇందులో మొలకశాతం తక్కువగా ఉంటుంది. గత ఖరీఫ్‌ సీజన్‌లో ఉత్పత్తి చేసిన పాత విత్తనాల్లో 70 శాతం మాత్రమే మొలక ఉంది. ఈ ఏడాది రబీ సీజన్‌లో ఉత్పత్తి చేసిన వరి విత్తనాల్లో 80 నుంచి 90శాతం మొలక ఉంది. పాత విత్తనం అయితే పంట చేతికొచ్చే సమయంలో పైరు మొదలు కొంత మేర ధృఢంగా ఉండి నేలవాలిపోకుండా ఉంటుందని, కొత్తవిత్తనం అయితే పంట కోత దశకు ముందు నేలవాలిపోయే గుణం అఽధికంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. గత సీజన్‌లో ధాన్యం పాలుపోసుకునే దశ నుంచి కోత కోసే వరకు ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి కూడా విత్తనాలలో మొలకశాతం ఆధారపడి ఉంటుందని రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

వరి విత్తనాల పంపిణీ ఇలా..

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో ఎన్ని క్వింటాళ్ల వరి విత్తనాలు సబ్సిడీపై అందించాలనే అంశంపై వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. బీపీటీ-5204 రకం విత్తనాలు 2,600 క్వింటాళ్లు, ఎంటీయూ 1061 రకం విత్తనాలు 2,600 క్వింటాళ్లు, ఎంటీయూ 1224 రకం విత్తనాలు 600 క్వింటాళ్లు, ఎంటీయూ 1318 రకం విత్తనాలు 5,200 క్వింటాళ్లు, ఎంటీయూ 1262 రకం విత్తనాలు 600 క్వింటాళ్లు రైతులకు సబ్సిడీపై ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

చిన్న, సన్నకారు రైతులకు విత్తనాలు అందేనా?

రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు అందించేందుకు ఆంక్షలను విధిస్తున్నారు. రైతులు ఆర్‌ఎస్‌కేలకు పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్‌ కార్డులను తీసుకువెళ్లి పేర్లు ముందుగానే నమోదు చేయించుకోవాలి. ఎంత మేర విత్తనాలు కావాలో తెలియజేస్తూ వివరాలు అందజేయాలని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి వచ్చిన ఇండెంట్‌ను బట్టి అప్పుడు ఏపీసీడ్స్‌కు ఇండెంట్‌ పెడతామని అంటున్నారు. మండల వ్యవసాయశాఖ కార్యాలయాల వద్దకు వరి విత్తనాలు వచ్చినా పెద్ద రైతులు లేదా వ్యాపారుల చేతుల్లోకే విత్తనాలు గుట్టు చప్పుడు కాకుండా చేరడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. రెండు, మూడు ఎకరాల భూమిని సాగు చేసే రైతులు వరి విత్తనాల కోసం వ్యవసాయశాఖ కార్యాలయాలకు వెళితే స్టాక్‌ లేదని, మళ్లీ వస్తాయని అప్పుడు కబురు చేస్తామని చెప్పి పంపేయడం అలవాటుగా మారింది. వేరుశెనగ విత్తనాలను కడప, అనంతపురం జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఈ విత్తనాలను ఈ ఏడాది సబ్సిడీపై ఇచ్చే అంశంపై ఇంకా స్పష్టతలేదు.

ప్రైవేటు వ్యాపారుల కనుసన్నల్లోనే..

వ్యవసాయశాఖ అధికారులు సూచనల మేరకు వరి వంగడాలను సాగు చేయాలని రైతులు ఆలోచన చేసినా క్షేత్రస్థాయిలో అమలు కాని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌ సీజన్‌లో ఎంటీయూ 1061, 1064, 1121, 7029, 1318, 1224, స్వర్ణ, బీపీటీ-5204 వంటి వరి వంగడాలను జిల్లా రైతులు సాగు చేస్తారు. కానీ వ్యవసాయశాఖ ద్వారా ఎంటీయూ 1061, 1318, 1262, బీపీటీ 5204, రకాలను మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. మిగిలిన అన్ని రకాల వరి వంగడాలను ప్రైవేటు వ్యాపారుల నుంచే రైతులు కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రైవేటు వ్యాపారులు తమ వద్ద ఉన్న వరి వంగడాలు దిగుబడులు అధికంగా వస్తాయని చెప్పి రైతులకు అంటగడ తారు. దీంతో ప్రైవేటు వ్యాపారుల సూచనల మేరకే రైతులు వరి వంగడాలను రైతులు ఎంచుకోవాల్సినస్థితి ఏర్పడుతోంది. ప్రైవేటు వ్యాపారులు ఇచ్చిన విత్తనాలు సక్రమంగా మొలక రాకున్నా, దిగుబడి రాకున్నా ప్రశ్నించేందుకు అవకాశంలేదు. రైతులు స్వర్ణరకం కొంతమేర సాగుచేస్తారు. ఆ రకం విత్తనాలు అందుబాటులో లేవని, సంపత స్వర్ణరకం విత్తనాలను గతేడాది రైతులకు అంటగట్టారు. ప్రైవేటు వ్యాపారులు నాణ్యమైన వరివిత్తనాలు విక్రయిచేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - May 16 , 2025 | 12:39 AM