Share News

ఇక ‘అమ్మ’ సేవ

ABN , Publish Date - Jun 09 , 2025 | 01:11 AM

శ్రీవారి సేవ... తిరుమలలో సేవ చేయాలనుకున్న వారికి వేదిక ఇది. దీని తరహాలోనే దుర్గమ్మ సేవకు ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. శ్రీవారి సేవ మాదిరిగానే శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అమ్మవారి సేవకు సంబంధించి కొత్తగా సేవా విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

ఇక ‘అమ్మ’ సేవ

దుర్గగుడిలో ప్రత్యేకంగా సేవా విభాగం ఏర్పాటు

రోజుకు 200 మంది సేవకులకు అవకాశం

సేవలో ఇక సమూల మార్పులు

అంతరాలయం వద్ద సెక్యూరిటీ స్థానంలో సేవకులకు ఛాన్స్‌

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

శ్రీవారి సేవ... తిరుమలలో సేవ చేయాలనుకున్న వారికి వేదిక ఇది. దీని తరహాలోనే దుర్గమ్మ సేవకు ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. శ్రీవారి సేవ మాదిరిగానే శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అమ్మవారి సేవకు సంబంధించి కొత్తగా సేవా విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అన్ని విభాగాల మాదిరిగానే ఈ సేవా విభాగం శాశ్వతంగా పనిచేస్తుంది. దీనికి ఒక ఏఈవో, ఒక సూపరింటెండెంట్‌, ఒక గుమస్తాను కేటాయించారు. ప్రస్తుతం సేవకులకు సంబంధించి ప్రత్యేక విభాగమేమీ లేదు. సేవకుల పేర్లను రిజిస్టర్‌ చేసుకునే విధులను ఇతర విభాగాల్లో ఉన్న సిబ్బందికి అప్పగించేవారు. ఇక నుంచి ఆ విధంగా కాకుండా అమ్మ సన్నిధిలో సేవ చేయాలనుకున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం నిర్వహించిన సమావేశాల్లో స్పష్టం చేశారు. దీనితోపాటు ఐవీఆర్‌ఎస్‌లో భక్తుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలను క్రోడీకరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారి సేవకు వచ్చిన సేవకులకు వన్‌టౌన్‌లో ఉన్న సీవీరెడ్డి సత్రంలో బస కల్పిస్తారు. వారికి దుర్గగుడిలో భోజనం ఏర్పాటు చేస్తారు. సేవ చేయాల్సిన ప్రాంతాలకు వారిని దేవస్థాన వాహనాల్లో తీసుకెళ్లి వదులుతారు. తర్వాత అక్కడి నుంచి వాహనాల్లో తీసుకొచ్చి బస కేంద్రం వద్ద దింపుతారు. సేవ పూర్తయిన తర్వాత సేవకులకు అమ్మవారి దర్శనం చేయించి, ప్రసాదంతోపాటు సామూహిక వేద ఆశీర్వచనం ఇప్పిస్తారు. ప్రస్తుతం సేవకులతో సేవ మాత్రమే చేయిస్తున్నారు. ఈ విధానాన్ని త్వరలో మార్పు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

నిత్యం 200 మందికి అవకాశం

దుర్గగుడితో పాటు దానికి అనుబంధంగా ఉన్న అన్ని ప్రదేశాల్లో సేవకులను ఉపయోగించబోతున్నారు. రోజుకు 200 మంది సేవలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి సేవ చేయడానికి దేశ వ్యాప్తంగా భక్త బృందాలు ఉంటాయి. సేవకు వెళ్లాలనుకున్న భక్తులు అయినా, భజన బృందాలు అయినా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. ఖాళీ ఉన్న తేదీలను చూసుకుని బుక్‌ చేసుకోవాలి. అక్కడికి వెళ్లిన తర్వాత శ్రీవారి సేవా విభాగం వారికి సేవలు చేయాల్సిన ప్రదేశాలను కేటాయిస్తుంది. దుర్గగుడిలోను ఇక నుంచి ఆ విధంగా చేయబోతున్నారు. అమ్మవారికి సేవ చేయాలనుకున్న వారి రిజిసే్ట్రషన్లను ప్రస్తుతం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో చేస్తున్నారు.

అన్ని సేవలకు వినియోగించాలని..

ఈ సేవకులను ప్రస్తుతం అన్నదానం విభాగంలో, క్యూలైన్ల వద్ద ఉపయోగిస్తున్నారు. రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌ నుంచి ఇంద్రకీలాద్రికి అనుసంధానంగా అన్ని ప్రదేశాల్లో సేవకులను వినియోగించుకోవడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతరాలయం ముందు, లోపల ప్రస్తుతం మహిళా సెక్యూరిటీగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. రద్దీ లేని సమయాల్లోను అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోనివ్వడం లేదన్న ఆరోపణ వారిపై ఉంది. దీనితో అంతరాలయంతో పాటు ముఖద్వార దర్శనం, ఉచిత, రూ.100 క్యూలైన్ల వద్ద సెక్యూరిటీ గార్డులను తొలగించి ఆ స్థానంలో సేవకులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇది కాకుండా అన్నదానం, క్యూలైన్ల ప్రవేశ మార్గం, ప్రసాదం కౌంటర్లు, సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ పాయింట్లు, లగేజీలను భద్రపరిచే కౌంటర్‌, చెప్పుల స్టాండ్‌ వద్ద సేవకులను నియమించబోతున్నారు. కనకదుర్గానగర్‌లో వాహనాల పార్కింగ్‌ వద్ద నిత్యం సెక్యూరిటీ గార్డులకు భక్తులకు ఏదో ఒక విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ గార్డులకు సహాయకులుగా ఈ సేవకులను నియమిస్తారు. వాటితోపాటు ఆర్జిత సేవల వద్ద ఈ సేవకులను ఉపయోగించుకుంటారు.

బస్టాప్‌ల వద్ద

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను ఇంద్రకీలాద్రి మీదకు తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా బస్సులను దేవస్థానం నడుపుతోంది. రైల్వేస్టేషన్‌ నుంచి ఒక బస్సు, పీఎన్‌బీఎస్‌ నుంచి మరో బస్సు, దుర్గాఘాట్‌ నుంచి ఒక బస్సు ఇంద్రకీలాద్రి పైకి భక్తులను చేర్చుతున్నాయి. దుర్గాఘాట్‌ వద్ద కృష్ణానదిలో స్నానాలు చేసిన తర్వాత ఇక్కడే భక్తులు బస్సు ఎక్కుతారు. దుర్గాఘాట్‌తో పాటు రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎస్‌ వద్ద బస్సు ఎక్కేటప్పుడు భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కుతున్నారు. ఈ తోపులాటలో చిన్నపిల్లలు నలిగిపోతున్నారు. ఇక ఈ పరిస్థితికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని భావించారు. ఈ మూడు పాయింట్లలో సేవకులను నియమిస్తారు. వారు భక్తులను ఒక క్యూలో నిలబెట్టి ఒకరి తర్వాత మరొకరిని బస్సు ఎక్కిస్తారు. దీనివల్ల ఎలాంటి తోపులాటలు ఉండవన్నది అధికారుల భావన.

Updated Date - Jun 09 , 2025 | 01:11 AM