Share News

Ward Secretariats: ఒక్క ఉద్యోగినీ తొలగించం

ABN , Publish Date - May 22 , 2025 | 04:37 AM

సచివాలయ ఉద్యోగులను తొలగించబోమని, రేషనలైజేషన్‌ ద్వారా పని భారం తగ్గించడమే లక్ష్యమని మంత్రి బాలవీరాంజనేయస్వామి తెలిపారు. జనాభా ఆధారంగా సిబ్బంది విభజన చేసి, మూడు అంచెల పర్యవేక్షణ విధానం అమలు చేయనున్నామని వెల్లడించారు.

Ward Secretariats: ఒక్క ఉద్యోగినీ తొలగించం

సచివాలయ సిబ్బంది ఆందోళన చెందొద్దు

కార్యాలయాల సంఖ్య తగ్గించే యోచన లేదు

వాటి ద్వారా రియల్‌ టైమ్‌లో మరిన్ని సేవలు

సిబ్బందిని సర్దుబాటు చేశాకే బదిలీలు: డోలా

అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులెవరినీ తొలగించబోమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. సచివాలయాల సంఖ్యను తగ్గించే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదన్నారు. రేషనలైజేషన్‌పై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, పని విభజన శాస్త్రీయంగా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. పనిభారం తగ్గించేలా రేషనలైజేషన్‌ ఉంటుందన్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. సచివాలయాల ద్వారా రియల్‌ టైమ్‌లో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా వాటిని తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించామని, ఆ ప్రకారం సిబ్బందిని సర్దుబాటు చేస్తామని తెలిపారు. 2,500 జనాభా గల గ్రామ సచివాలయంలో ఆరుగురు సిబ్బందిని, 2,500-3,000 జనాభా గల సచివాలయాల్లో ఏడుగురు, 3 వేలకుపైన జనాభా గల సచివాలయాల్లో 8మంది సిబ్బంది ఉండేలా విభజించామన్నారు. అదేవిధంగా క్లస్టర్‌ విధానం అనుసరిస్తామని, అందుకు అనుగుణంగా సిబ్బందిని సర్దుబాటు చేశాక బదిలీలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుత సాధారణ బదిలీల సమయంలో సచివాలయాల సిబ్బంది బదిలీల ప్రక్రియను చేపట్టబోమని మంత్రి స్పష్టం చేశారు. త్వరలో మూడు అంచెల విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్లానింగ్‌ బోర్డులు ఏర్పాటు చేసి.. జిల్లా స్థాయిలో జిల్లా అధికారి, మండల స్థాయిలో ఎంపీడీవో, నియోజకవర్గ స్థాయిలో ఒక అధికారికి కొంతమంది సిబ్బందిని ఇచ్చి.. వారిద్వారా గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు పోలీస్‌ శాఖలోకి వెళ్లడమా లేక ఐసీడీఎ్‌సలోకి వెళ్లడమా అనేది వారికే ఆప్షన్‌ ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 04:37 AM