Amaravati Land Pooling: భూములిచ్చినా కష్టాలే
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:50 AM
అమరావతిలో రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం చెబితే రైతులు మూడు పంటలు పండే 33వేల ఎకరాల భూములను సీఆర్‌డీఏకు అప్పగించారు. ఇందు లో పట్టా భూములతోపాటు ఇనాం (దేవదాయ), గ్రామకంఠం, అసైన్డ్ భూములను ల్యాండ్‌పూలింగ్‌లో తీసుకున్నారు.
రాజధానిలో ల్యాండ్‌పూలింగ్ జరిగి పదేళ్లు ఇనామ్, గ్రామకంఠం రైతులకు ఈనాటికీ ప్లాట్లు లేవు..కౌలూ లేదు
అసైన్డ్ రైతులకు అసైన్డ్‌లోనే ప్లాట్లు
రిజిస్ట్రేషన్.. అమ్మకాలు.. అన్నింటా చిక్కులు
నాన్చుతున్న సీఆర్‌డీఏ.. రైతుల్లో ఆందోళన
‘ఆంధ్రజ్యోతి’తో బాధితుల మొర
ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని విన్నపం
ప్రభుత్వం పిలుపునివ్వగానే రాజధానిలో రైతులు తమ భూములిచ్చారు. సీఆర్‌డీఏ జరిపిన ల్యాండ్‌పూలింగ్‌లో పట్టాదారులకు మాత్రమే న్యాయం దక్కింది. ఇనాం, గ్రామకంఠం లబ్ధిదారులకు మేలన్నది ఇంకా అందని ద్రాక్షగానే ఉండిపోయింది. వారికి ప్లాట్లు ఇవ్వలేదు. కౌలు అన్నదే లేదు. అసైన్డ్ రైతులకు అసైన్డ్ భూముల్లోనే ప్లాట్లు ఇవ్వడంతో అవసరానికి అమ్ముకోలేకపోతున్నారు. భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లుగా దక్కుతున్న న్యాయం ఇదేనా? అన్న ప్రశ్న అమరావతిలోని 29 గ్రామాల ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అమరావతి రైతుల సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ వార్తలు ప్రచురిస్తోంది. వాటికి స్పందించిన రైతులు తమకూ సమస్యలున్నాయంటూ ‘ఆంధ్రజ్యోతి’కి మొరపెట్టుకుంటున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అమరావతిలో రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం చెబితే రైతులు మూడు పంటలు పండే 33వేల ఎకరాల భూములను సీఆర్‌డీఏకు అప్పగించారు. ఇందు లో పట్టా భూములతోపాటు ఇనాం (దేవదాయ), గ్రామకంఠం, అసైన్డ్ భూములను ల్యాండ్‌పూలింగ్‌లో తీసుకున్నారు. దేవదాయశాఖకు సంబంధించిన దాదాపు 1017 ఎకరాలు సేకరించారు. మరో 187 ఎకరాలు దేవదాయశాఖతో వివాదం ఉన్న భూములు. వీటిని ఇనామ్ భూములుగా చూస్తున్నారు. ఇవి కాకుండా మరో 600 ఎకరాలు ఇనామ్ భూములున్నాయి. మరో 350 ఎకరాల్లో గ్రామకంఠం భూములున్నాయి. ఇవి రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. పట్టా భూములు తీసుకున్నందుకు రైతులకు నివాస, వాణిజ్య అవసరాలకోసం 2016లోనే రిటర్నబుల్‌ప్లాట్లు కేటాయించారు. దేవదాయశాఖతో వివాదం ఉన్న 187 ఎకరాల ఇనాం భూములను సీఆర్‌డీఏ సెటిల్ చేసింది. అంటే, ఆ భూములకు గాను దేవదాయశాఖకు పరిహారం చెల్లించింది. కానీ, ఆ భూములపై హక్కులు ఉన్న రైతులకు ఈ నాటికీ ప్లాట్లు కేటాయించలేదు.
దాదాపు 275 మంది రైతులకు కౌలు ఇవ్వడం లేదు. ఇవికాకుండా రాజధాని గ్రామాల్లోనే మరో 600 ఎకరాల ఇనామ్ భూములున్నాయి. వాటిని ఈ రోజు వరకు సెటిల్ చేయలేదు. ఆ భూములపై హక్కులున్న రైతులకు ఇటు ప్లాట్లు ఇవ్వలేదు. కౌలు చెల్లించడం లేదు. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాగుకు భూమిలేకపోవడంతోపాటు కౌలురాక జీవనోపాధిని కూడా కోల్పోయి రోడ్డున పడ్డారు.
ఏం పాపం చేశాం?
పేరుకే రాజధాని రైతులు. కానీ, ఇనామ్ భూములు కలిగి ఉన్నందుకు ప్లాట్లకు, కౌలుకు వారు నోచుకోవడం లేదు. తాము ఏం పాపం చేశామని ఈ రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ సమస్య గురించి సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు అనేక దఫాలుగా హామీలిచ్చినా నేటికీ పరిష్కారం కాలేదు. గ్రామకంఠం భూములను కూడా సీఆర్‌డీఏ పూర్తిగా తీసుకుంది. కానీ, రైతులకు ఆ మేరకు కౌలు, పరిహారం ఇవ్వడం లేదు. ప్లాట్లు అరకొరా కేటాయించారు. తమకు హక్కున్న మేరకు భూమిని పరిశీలించి కౌలు ఇవ్వాలని గ్రామకంఠం భూములున్న 175 మంది రైతులు సీఆర్‌డీఏ ఆఫీసుకు రోజువారీగా తిరుగుతున్నారు. నిజానికి గ్రామకంఠం భూముల సెటిల్‌మెంట్‌లో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్‌లో గ్రామకంఠాల మినహాయింపులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని నెక్కల్లుకు చెందిన రైతు శ్రీనివాస్ తీవ్ర ఆరోపణ చేశారు, ‘‘గ్రామకంఠాల మినహాయింపులో కొందరికి మేలు, మరి కొందరికి అన్యాయం జరిగింది. అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పు లు చేశారు. 50 సెంట్ల గ్రామకంఠం స్థలంలో 30 సెంట్లు పశువుల పాక, మరో 20 సెంట్లలో గడ్డివాములు ఉంటే, అధికారులు కేవలం పశువులపాక ఉన్న విస్తీర్ణాన్నే చూపించారు. గడ్డివాములున్న 20 సెంట్ల స్థలాన్ని గ్రామకంఠం నుంచి తొలగించారు. పలుకుబడి ఉన్నవాళ్లకు మేలు జరిగింది.
బక్కరైతులను దెబ్బకొట్టారు’’ అని శ్రీనివాస్ చెప్పారు. ఇదిలా ఉంటే, దేవదాయశాఖ భూమితో ఇనామ్ వివాదం ఉన్న భూములు 187 ఎకరాలు. వీటిని కూడా పూలింగ్‌లో తీసుకున్నారు. ఆ భూమికి సంబంధించిన పరిహారం దేవదాయశాఖకు చెల్లించారు. కానీ రైతులకు ప్లాట్లు కేటాయించలేదని, కౌలు ఇవ్వడం లేదని మందడానికి చెందిన రైతు కృష్ణమూర్తి ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సీఆర్‌డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా స్పందించడం లేదని చెప్పారు.
అసైన్డ్ భూముల్లో ప్లాట్లు కేటాయింపు
అసైన్డ్ భూములున్న రైతులు సీఆర్‌డీఏ పరిధిలో సరికొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి భూములను కూడా ల్యాండ్‌పూలింగ్‌లో తీసుకున్నారు. ఎకరాకు 800గజాలు చొప్పున రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు. అయితే ఈ ప్లాట్లు కూడా అసైన్డ్ భూముల్లోనే ఉన్నాయి. ఇలాంటి ప్లాట్లు తీసుకున్న రైతులు తమ పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇతరులకు అమ్ముకోలేకపోతున్నారు. రిజిస్ట్రేషన్లు జరగడం లేదని మందడానికే చెందిన రైతు వెంకటరమణ ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తీసుకొచ్చారు. ‘పట్టా, ఇనాం, గ్రామకంఠంతోపాటు అసైన్డ్ భూములను కూడా ల్యాండ్‌పూలింగ్‌లో తీసుకున్నారు. రైతులకు అసైన్డ్ భూములు తీసుకున్నందుకు అసైన్డ్ ప్లాట్లనే ఇచ్చారు. వాటిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నాం. భూములన్నీ సీఆర్‌డీఏ వశమయ్యాక, తమకిచ్చిన భూములపై ఇలాంటి షరతులు పెట్టడం ఎంత వరకు న్యాయం?’ అని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే రాజధానికి పట్టా భూములిచ్చిన రైతులకు భూసేకరణ చేయాల్సిన భూముల్లో ప్లాట్లు కేటాయించారని రైతులు చెబుతున్నారు.
ఆ 800 మంది రైతుల పరిస్థితేంటి?
జగన్ ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని చూసిన సంగతి తెలిసిందే. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే పేరిట అనేక కేసులు పెట్టారు. ఇందులో 800 మంది రైతులకు సంబంధించిన సమస్యలున్నాయి. వారికి ఇప్పటి వరకు కౌలు మంజూరుకాలేదు. బ్యాంక్ ఖాతాల ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ తప్పుగా ఉందనే కారణంతో మరికొందరు రైతుల ఖాతాల్లో కౌలు జమకావడం లేదు. సీఆర్‌డీఏ రైతులకు కేటాయించిన కొన్ని ప్లాట్లు వీధిపోటుతో ఉన్నాయి. మరి కొన్ని గ్రామాల్లో రైతులకు శ్మశానాల పక్కనే ప్లాట్లు కేటాయించారు. వాటిని మార్చాలని రైతులు కోరుతున్నారు. విలువైన భూములు ఇచ్చి శ్మశానాల పక్కన ఇచ్చే ప్లాట్లు తీసుకోవాలా? అని రాయపూడికే చెందిన రైతు లక్ష్మణరావు ప్రశ్నిస్తున్నారు.
బాబే మాకు న్యాయం చేయాలి
‘‘భూములిచ్చిన మాకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఏరికోరి వీధి పోటున్న స్థలాలు కొనుగోలు చేయం. ఒకవేళ అలాంటి ప్లాట్లు ఉన్నా ఇంటి నిర్మాణాలు చేయం. అలాంటిది మాకు 80 శాతం వీధిపోటు ఉన్న ప్లాట్లు కేటాయించారు. వాటిని మార్చాలని కోరుతున్నాం. కొందరు రైతులకు శ్మశానాల పక్కనే ప్లాట్లు ఇచ్చారు. సీఆర్‌డీఏ అధికారులు ఏ విషయాన్నీ సీరియ్‌సగా తీసుకోవడం లేదు. కాబట్టి మేం నమ్మిన చంద్రబాబే మా సమస్యలపై స్పందించాలి. మాకు సీఎం ఓ పరిష్కారం చూపాలి’’
- లక్ష్మణరావు, రాయపూడి రైతు