Minister Lokesh: అర్హులైన దివ్యాంగులకు అన్యాయం జరగనివ్వం
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:11 AM
దివ్యాంగుల పింఛన్ల విషయంలో అర్హులైన ఏ ఒక్కరికీ కూడా అన్యాయం జరగనివ్వబోమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన
పింఛన్లు తొలగిస్తే రీవెరిఫికేషన్ కోరవచ్చు
ప్రభుత్వం కూడా సమగ్ర పరిశీలన చేస్తుంది
దివ్యాంగుల పింఛన్లపై లోకేశ్ స్పష్టీకరణ
పింఛన్ల తొలగింపును ఆయన దృష్టికి తెచ్చిన మంత్రులు
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల పింఛన్ల విషయంలో అర్హులైన ఏ ఒక్కరికీ కూడా అన్యాయం జరగనివ్వబోమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగుల పింఛన్ల తొలగింపు విషయంపై రాష్ట్రవ్యాప్తంగా అలజడి ఉందని క్యాబినెట్ భేటీకి ముందు లోకేశ్‌కు మంత్రులు వివరించారు. అనర్హులను ఏరివేయాల్సిన అధికారులు కొన్ని చోట్ల అర్హులపైనా వేటు వేశారన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశం తన దృష్టికి కూడా వచ్చిందని లోకేశ్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో వేలాది మంది అనర్హులకు ఆ పార్టీ సానుభూతిపరులన్న ఒకే ఒక్క కారణంతో దివ్యాంగుల పింఛన్లు ఇచ్చారని వ్యాఖ్యానించారు. తొలగించిన పింఛన్ల విషయంలో మనం పారదర్శకంగా ఉన్నామన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సి ఉందన్నారు. తొలగించిన పింఛనుదారుల జాబితాలను సచివాలయాల వద్ద బహిరంగంగా ప్రదర్శించాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారు. అర్హులు ఎవరైనా తమ పింఛను తొలగింపుపై రీవెరిఫికేషన్ కోరవచ్చని సూచించారు. ప్రభుత్వం కూడా తొలగించిన పింఛన్లపై పూర్తిస్థాయిలో మరోసారి పరిశీలన చేయిస్తుందని హామీ ఇచ్చారు. మొత్తం 1.20 లక్షల పింఛన్ల వరకు నిలిపివేశారని, వారిలో కొందరు టీడీపీ వారు కూడా ఉన్నారని మంత్రులు లోకేశ్ దృష్టికి తీసుకురాగా, పార్టీలకతీతంగా అర్హులకు న్యాయం చేద్దామని లోకేశ్ వ్యాఖ్యానించారు. అనర్హులు మన పార్టీవారైనా పక్కన పెడదామన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ఒక్క దివ్యాంగుడు కూడా పింఛనుకు దూరం కాకూడదన్నది ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు.