AP High Court: 16 వరకు మోహిత్‌రెడ్డిపై తొందరపాటు చర్యలొద్దు
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:58 AM
మద్యం కుంభకోణం కేసులో నిందితుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి(ఏ39)పై ఈ నెల 16 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది.
సిట్ అధికారులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి(ఏ39)పై ఈ నెల 16 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు వాదనలు ముగియడంతో ప్రాసిక్యూషన్ తరఫు వాదనల కోసం విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్‌పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఈ కేసులో పిటిషనర్‌ను నిందితుడిగా చేర్చారని, అనంతరం సాక్షిగా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. మోహిత్‌రెడ్డి తండ్రి వద్ద పనిచేసిన సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్‌ను నిందితుడిగా చేర్చారని తెలిపారు. పిటిషనర్ తుడా చైర్మన్‌గా ఉండగా మద్యం ముడుపులను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించేందుకు తుడా వాహనాలు వాడారని, ఆ సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేశారనేది ప్రధాన ఆరోపణ అని అన్నారు. ఎన్నికల సమయంలో తుడా వాహనాలు పిటిషనర్ ఆధీనంలో ఉండవన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని ఒత్తిడి చేసి పిటిషనర్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించి ఉండవచ్చని తెలిపారు. వాహనంలో పిటిషనర్ ఉన్నట్లు కానీ, పిటిషనర్ ప్రోద్భలంతోనే డబ్బు తరలించినట్లు కానీ ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. కోర్టు షరతులకు కట్టుబడి ఉంటామని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రాసిక్యూషన్ వాదనలు వినేందుకు తగినంత సమయం లేకపోవడంతో విచారణ వాయిదా పడింది.