Minister Atchannaidu: ఎరువుల కోసం ఏ రైతూ ఇబ్బంది పడొద్దు
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:21 AM
రాష్ట్రంలో ఏ రైతూ ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
కలెక్టర్లకు మంత్రి అచ్చెన్న ఆదేశాలు
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏ రైతూ ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో ఎరువుల సరఫరాపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ‘మార్క్‌ఫెడ్ గోదాముల్లో బఫర్ స్టాక్ ఉంచాలి. కొరత ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నమైతే ముందుగానే గమనించి, ఎరువుల సరఫరా పెరిగేలా చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత ఉందన్న అపోహలు రైతుల్లో తలెత్తకుండా సహకార సంఘాలను పర్యవేక్షిస్తూ, దుకాణాలను తనిఖీలు చేసి, అందరికీ ఎరువులు అందుతున్నాయా, లేదా అని చూసుకోవాలి. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి, ఇతర రాష్ట్రాల కన్నా అధికంగా ఎరువులు తెప్పిస్తున్నా.. యూరియా కొరత ఎందుకు ఏర్పడుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి’ అని అధికారులను ఆదేశించారు. ఎరువుల కొరత అంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని రైతులను మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, డైరెక్టర్ డిల్లీరావు పాల్గొన్నారు.