Anti Drug Awareness: డ్రగ్స్ వద్దు బ్రో...
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:41 AM
డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు యువత, విద్యార్థుల జీవితాలను చిత్తు చేస్తున్నాయి. ఎన్నో దుష్పరిణామాలకు కారణమవుతున్నాయి.
పోలీసులు, ఈగల్ అవగాహన కార్యక్రమాలు
మత్తుకు వ్యతిరేకంగా ‘అభ్యుదయం’ యాత్ర
విద్యార్థులు, యువతతో కలసి డ్రగ్స్‌పై సమరం
‘మా ఫ్రెండ్ క్లాస్ టాపర్. ఒక మంచి ఇంజనీర్ అవుతాడనుకున్నాం. అలాంటివాడు అనూహ్యంగా డ్రగ్స్‌కు బానిసగా మారాడు. చివరికి వాటిని సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కోర్టు పదేళ్ల శిక్ష విధించడంతో విశాఖ సెంట్రల్ జైలు పాలయ్యాడు.’
- ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి ఆవేదన
‘మా అబ్బాయిని మంచి ప్రయోజకుడిని చేద్దామనుకున్నా.. వాడు గంజాయికి అలవాటు పడ్డాడని తెలిసింది.. కౌన్సిలింగ్ ఇప్పించడంతో మత్తు మహమ్మారికి దూరమయ్యాడు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. లేకపోతే... డ్రగ్స్‌తో పాటు నేరాలకు కూడా అలవాటు పడితే మన కుటుంబమే కాదు.. సమాజమూ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.’
- ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఓ తండ్రి అనుభవం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు యువత, విద్యార్థుల జీవితాలను చిత్తు చేస్తున్నాయి. ఎన్నో దుష్పరిణామాలకు కారణమవుతున్నాయి. వీటిని సమూలంగా నిర్మూలించడానికి పోలీసులు, ఈగల్ బృందాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను వివరించడంతో పాటు వివిధ శాఖల సమన్వయంతో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదంతో అవగాహన కల్పిస్తున్నాయి. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సరిగ్గా నెల క్రితం విశాఖ రేంజ్ పోలీసులు ప్రారంభించిన ‘అభ్యుదయం’ యాత్రలో హోంమంత్రి అనిత, డీఐజీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు. అలాగే విజయవాడ ర్యాలీలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, అనంతపురంలో ఎస్పీ జగదీశ్.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి విద్యార్థులు, ప్రజలు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. ఎక్కడికక్కడ సైకిల్ ర్యాలీలు, సభలు, కళాజాతాల రూపాల్లో.. ‘డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు బ్రో..’, ‘సిగరెట్టు- రోగానికి మొదటి మెట్టు.. గుట్కా- నరకానికి దగ్గరి దారి.. గంజాయి- శ్మశానంలో చోటు ఖరారు.. డ్రగ్స్- ఆ మూడింటికీ మించి..’ అంటూ పోలీసులు, ఈగల్ బృందాలు ప్రచారం చేస్తున్నాయి. నవంబరు రెండోవారంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ మొదలుపెట్టిన అవగాహనర్యాలీలు మత్తు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అన్ని వర్గాల్లోనూ చైతన్యం నింపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ గంజాయి ఉత్పత్తి కేంద్రంగా, డ్రగ్స్ దిగుమతికి చిరునామాగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉత్తరాంధ్రలో పది వేల ఎకరాలకు పైగా గంజాయి సాగవుతోంది.

ఏడాదిలోనే దాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన పోలీసులు... గంజాయి సాగుకు దూరంగా ఉంటామని గిరిజన రైతులతో ప్రమాణం చేయించారు. అయితే ఒడిశా నుంచి రవాణా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో వినియోగం ఆశించిన మేర తగ్గలేదు. దీంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉత్తరాంధ్రలో జిల్లాల ఎస్పీలతో సమావేశమై ‘సంకల్పం’ పేరుతో ఏడాదిగా 19వేల చోట్ల 10.80 లక్షల మంది ప్రజలు, విద్యార్థులతో 4,700 విద్యాసంస్థల్లో చైతన్యం కల్పించారు. గంజాయి సాగు, సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపారు. జాగిలాలతో పాటు డ్రోన్లతో స్మగ్లర్లను పోలీసులు వెంటాడారు. ఇది మంచి ఫలితాలివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ’డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు బ్రో..’ అంటూ చైతన్య ర్యాలీలకు పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. ఏడాది చివరి వరకూ ఈ ప్రచారాన్ని కొనసాగిస్తామని, కొత్త సంవత్సరంలో మరో రూపంలో డ్రగ్స్ అరికట్టేందుకు ప్రజల్లోకి వెళతామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వినియోగం లేకుండా చేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
మత్తుకు దూరంగా ఉండండి
ప్రతి విద్యార్థి, యువకుడు తన కుటుంబానికి, ఈ దేశానికి ఉపయోగపడాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. గంజాయి, డ్రగ్స్ బారిన పడితే ఏదో ఒకరోజు పట్టుబడక తప్పదు. ఎన్‌డీపీఎస్ యాక్టు కింద అరెస్టయితే వారి జీవితంపై పిడుగు పడ్డట్లే.. కనీసం పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. జీవితంలో కీలక సమయం కోల్పోతారు. దేశాన్ని ప్రేమించే వారైతే మత్తుకు దూరంగా ఉండండి. డ్రగ్స్, గంజాయిపై టోల్‌ఫ్రీ నంబరు 1072కు సమాచారం ఇవ్వండి.
- ఆకే రవికృష్ణ, ఈగల్ ఐజీ
సర్వస్వం కోల్పోతారు
స్నేహితులు, తెలిసినవారు ఒత్తిడి చేశారనో, ఆసక్తితోనో ఒకసారి మత్తుకు అలవాటు పడితే శారీరకంగా, మానసికంగానే కాదు మొత్తం జీవితాన్నే కోల్పోతారు. పిల్లల్ని నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారి ప్రవర్తనలో తేడా కనివస్తే తల్లితండ్రులు వెంటనే అప్రమత్తం కావాలి. గంజాయి సాగు, నిల్వ, రవాణా మాత్రమే కాదు వినియోగించినా చట్టపరంగా చర్యలు తప్పవు.
- గోపీనాథ్ జెట్టి, విశాఖ రేంజ్ డీఐజీ
ఎవరో ఇచ్చారని తీసుకుంటే...
బెంగళూరులో వీకెండ్ పార్టీకి వెళ్లాం.. హైదరాబాద్‌లో ఫ్రెండ్స్‌తో పబ్‌కు వెళ్లాం.. అక్కడ ఎవడో రుచి చూపించాడు అని డ్రగ్స్ తీసుకుంటే చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకున్నట్లే. మీరు తీసుకునే డ్రగ్స్ మీకు, మీ కుటుంబానికే కాదు సమాజానికి, దేశానికీ నష్టమే. డ్రగ్స్‌కు దూరంగా.. లక్ష్య సాధనకు దగ్గరగా ఉండండి.
- జగదీష్, అనంతపురం జిల్లా ఎస్పీ