Admission Coordination: ఇంజనీరింగ్ కాలేజీల్లో నో డిగ్రీ
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:37 AM
సాంకేతిక విద్యాశాఖ నిర్వాకం కారణంగా ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సుల అడ్మిషన్లకు అనుమతి లభించలేదు. గత రెండేళ్లుగా ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ...
బీబీఏ, బీసీఏ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి పొందిన పలు కాలేజీలు
ఆ జాబితాను ఉన్నత విద్యామండలికి పంపని సాంకేతిక విద్యాశాఖ
ఫలితంగా ఈసారి నిలిచిన అడ్మిషన్లు
డిగ్రీ అడ్మిషన్లపై సమన్వయ లోపం
కాలేజీల ద్వారా రిజిస్ర్టేషన్లకు ఒక్కరోజే గడువు
అమరావతి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక విద్యాశాఖ నిర్వాకం కారణంగా ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సుల అడ్మిషన్లకు అనుమతి లభించలేదు. గత రెండేళ్లుగా ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ డిగ్రీ కోర్సులకు అనుమతులు వచ్చాయి. ఏఐసీటీఈ నుంచి అనుమతులు పొందిన ఇంజనీరింగ్ కాలేజీలు బీబీఏ, బీసీఏ కోర్సులను ప్రవేశపెట్టాయి. ఆ రెండు కోర్సులకు ఏఐసీటీఈ నుంచి అనుమతులు వచ్చాక సాంకేతిక విద్యాశాఖ ఆ కాలేజీలు, కోర్సుల జాబితాను ఉన్నత విద్యామండలికి ఇవ్వాలి. కానీ ఆ వివరాలను మండలికి ఇవ్వలేదు. దీంతో ఆ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సులను ఆప్షన్లలో పెట్టకపోవడంతో అడ్మిషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక విద్యాశాఖ స్పందించని కారణంగా ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజీలు అడ్మిషన్ల జాబితాలో లేకుం డా పోయాయి. దీంతో ఆ రెండు కోర్సులు కోరుకునే విద్యార్థులకు నిరాశ ఎదురవుతోంది. బీబీఏ, బీసీఏ కోర్సులకు ఇప్పుడు డిమాండ్ భారీగా ఉంది. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ సీటు రానివారు బీసీఏ కోర్సుకు మొగ్గు చూపుతుండగా.. బీబీఏ కోర్సులకూ డిమాండ్ పెరిగింది.
ఉన్నత విద్యాశాఖ, విద్యామండలి మధ్య సమన్వయ లోపం
మరోవైపు డిగ్రీ అడ్మిషన్ల వ్యవహారంలో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఒకే శాఖలోని రెండు విభాగాలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో అడ్మిషన్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. డిగ్రీ అడ్మిషన్లపై ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకు కాలేజీ లాగిన్ ద్వారా కూడా అడ్మిషన్లు చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఈ నెల 20న రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. సోమవారం నుంచి మాత్రమే కాలేజీల ద్వారా అడ్మిషన్ అవకాశం కల్పించారు. కానీ సోమవారం సాయంత్రం వరకు కూడా తమకు లాగిన్ అయ్యే అవకాశం రాలేదని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. మంగళవారంతో రిజిస్ర్టేషన్ల గడువు ముగిసిపోతోంది. ఒకవేళ విద్యార్థి ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకొని ఉంటే కాలేజీల వద్దకు వెళ్లి ఈ నెల 28 వరకు ఆప్షన్లు పెట్టుకోవచ్చు. కానీ, ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకున్న విద్యార్థి అక్కడే ఆప్షన్లు ఎంపిక చేసుకుంటారు తప్ప కాలేజీలకు వెళ్లే అవకాశం పెద్దగా ఉండదు. దీంతో కాలేజీల లాగిన్ ద్వారా అడ్మిషన్ విధానం ఉన్నా విద్యార్థులు దానిని ఉపయోగించుకునే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు కాలేజీలకు వెళ్లి పెట్టుకున్న ఆప్షన్లను తర్వాత మార్చుకునే అవకాశమూ లేకుండా చేశారు. దీంతో కాలేజీలకు వెళ్లి దరఖాస్తు సమర్పించడం ఎందుకనే సందేహాలు వస్తున్నాయి. కాలేజీలకు వెళ్లి దరఖాస్తు చేసుకునే విధానంపై సందేహాలు ఉన్నాయంటూ ఉన్నత విద్యామండలి ఇటీవల ఉన్నత విద్యాశాఖకు లేఖ రాసింది. ఉన్నత విద్యాశాఖ వారం రోజులైనా స్పందించలేదు. రోజులు గడుస్తున్నా సమాధానం రాకపోవడంతో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీచేస్తామంటూ మండలి అధికారులు మరో లేఖ రాశారు. అప్పుడు హడావిడిగా ఉన్నత విద్యాశాఖ క్లారిఫికేషన్ జారీచేసింది. అది కూడా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కాకుండా, మధ్య స్థాయి అధికారే ఈ స్పష్టత ఇచ్చారు. అప్పుడు ఉన్నత విద్యామండలి హడావిడిగా ఆఫ్‌లైన్ అడ్మిషన్లపై మార్గదర్శకాలు జారీచేసింది.