AP Govt: ఏర్పాట్లలో ఎక్కడా తగ్గొద్దు
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:32 AM
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న రాష్ట్రానికి రానున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత శ్రీశైలం మల్లికార్జున స్వామి సేవలో పాల్గోని, అనంతరం కర్నూలులో నిర్వహించనున్న సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభకు హాజరవుతారు.
ప్రధాని పర్యటనపై అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
16న మోదీ రాక.. కర్నూలులో సభ ఏర్పాట్లపై వర్చువల్‌గా సీఎం సమీక్ష
పరిశీలించిన పల్లా, మంత్రి టీజీ
కర్నూలు, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న రాష్ట్రానికి రానున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత శ్రీశైలం మల్లికార్జున స్వామి సేవలో పాల్గోని, అనంతరం కర్నూలులో నిర్వహించనున్న సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రధాని ఏర్పాట్లపై వర్చువల్ విధానంలో ఆదివారం సమీక్షించారు. గతంలో ప్రధాని అమరావతి, విశాఖపట్నంలో పర్యటించారని, అప్పట్లో జరిగిన ఏర్పాట్లకుమించి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని, మోదీ పర్యటనను దిగ్విజయం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కర్నూలులో ప్రధాని పాల్గొనే సభా ప్రాంగణం నుంచి పీఎం ప్రొగ్రామ్స్ స్పెషల్ ఆఫీసర్ వీరపాండియన్, జిల్లా కలెక్టర్ ఎ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సహా పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. 16న ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి నేరుగా శ్రీశైలం చేరుకుంటారు. మల్లికార్జున జ్యోతిర్లింగం, భ్రమరాంబ శక్తిపీఠం ఉన్న శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం, కర్నూలు నగర శివారులోని ఓర్వకల్లు మండలం, నన్నూరు టోల్‌ప్లాజా దగ్గర రాగమయూరి వెంచర్‌లో నిర్వహించే ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు దాదాపు 3-4 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రధాని మరో మూడు రోజుల్లో రానున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఏర్పాట్లు పూర్తి చేయండి.’’ అని ఆదేశించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, హెలీప్యాడ్ నిర్మాణం, వాహనాలకు పార్కిం గ్, రోడ్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో జిల్లా అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
ప్రధాని సభకు తరలివచ్చే సభికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రవాణా, ఆహారం, తాగునీరు సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు. భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. మరోవైపు, మంత్రి టీజీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తదితరులు ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఆదివారం స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.