CPI State Secretary Ramakrishna: బాబు వచ్చినా మార్పు లేదు
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:30 AM
నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి అమలు చేసిన నమూనాలు విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.
ప్రత్యామ్నాయ నమూనాతోనే సమగ్రాభివృద్ధి: కె.రామకృష్ణ
నేడు ఒంగోలులో సీపీఐ కొత్త కార్యదర్శి ఎన్నిక?
రేసులో ముప్పాళ్ల, ఈశ్వరయ్య
ఒంగోలు, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి అమలు చేసిన నమూనాలు విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. తొలి ఐదేళ్లలో పోలవరం, అమరావతి జపం చేస్తూ ఇతర ప్రాంతాల అభివృద్ధిని చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక బటన్ నొక్కి అకౌంట్లలో అరకొర నగదు వేసి ఓట్లు దండుకోవాలనుకున్నాడు తప్ప రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేశాడని మండిపడ్డారు. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూడా మార్పు లేదన్నారు. ఒంగోలులో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర 28వ మహాసభల్లో భాగంగా రెండోరోజు ఆదివారం ఇక్కడి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ప్రతినిధుల సభ జరిగింది. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవీఎన్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభను సీపీఐ జాతీయ నాయకురాలు వహీదా నవాజ్ ప్రారంభించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, పారిశ్రామిక, ఐటీ, భూములు, అమరావతి అభివృద్ధిపై ప్రత్యామ్నాయ నమూనా రూపొందించి అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టాల్సి ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహమంటూ.. 140 కోట్ల భారతీయుల క్షేమం కన్నా అదానీ, అంబానీల శ్రేయస్సుకే ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారని వహీదా మండిపడ్డారు. పార్టీ అగ్ర నేత సురవరం సుధాకర్‌రెడ్డి మరణించడంతో సీపీఐ ప్రతినిధులు సభ ప్రారంభ సమయంలో ఆనవాయితీగా చేసే ఎర్రజెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేశారు. సభలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఇంకోవైపు.. 11 ఏళ్లుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగిన రామకృష్ణ వైదొలుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో సీనియర్ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు (గుంటూరు), యువజన నేత జి.ఈశ్వరయ్య (కడప) రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.