Advocate General: సీఎం సహా మంత్రుల సినీ నటనపై నిషేధం లేదు
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:40 AM
ముఖ్యమంత్రి సహా మంత్రులుగా ఉన్న వారు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు.
మాజీ సీఎం ఎన్‌టీఆర్ విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది
కోర్టు సమయాన్ని వృథా చేసిన మాజీ ఐఏఎ్‌సకు ఖర్చులు విధించండి
పిటిషన్‌ను కూడా కొట్టివేయండి.. హైకోర్టులో అడ్వకేట్ జనరల్ వాదనలు
అమరావతి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహా మంత్రులుగా ఉన్న వారు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. సినీనటుడు, మాజీ సీఎం ఎన్‌టీఆర్ విషయంలో హైకోర్టు ఫుల్ బెంచ్ గతంలోనే స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాత్ర ఉన్నట్లు పిటిషనర్ ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదన్నారు. టికెట్ ధరలను పెంచుతూ ఇచ్చిన మెమోను సైతం పిటిషనర్ సవాల్ చేయలేదని తెలిపారు. ప్రాథమిక అంశాలను పరిశీలించకుండానే పిటిషన్ వేసి, కోర్టు సమాయాన్ని వృథా చేస్తున్నారని, వ్యాజ్యానికి విచారణార్హత కూడా లేదన్నారు. వ్యాజ్యం దాఖలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌కు ఖర్చులు విధించి పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఈ దశలో విజయ్‌కుమార్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని.. ఎన్‌టీఆర్ విషయంలో ఇచ్చిన తీర్పును పరిశీలించి, వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరు ్టను కోరారు. ఈలోపు కౌంటర్ వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యో తిర్మయి కౌంటర్ దాఖలుపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొన్నారు. ఏజీ ఇప్పటికే వాదనలు వినిపించారని, పిటిషనర్ తరఫున రిప్లై వాదనల కోసం విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
ఇదీ పిటిషన్
పవన్‌కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకొనేందుకు ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని వినియోగించారని.. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ విజయ్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది బాల వాదనలు వినిపించారు. ‘‘ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ సినిమాల్లో నటించడం అనైతికం. రాజ్యాంగ విరుద్ధం. వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు, వాణిజ్య కార్యక్రమాలు ప్రమోట్ చేసుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ధరల పెంపు ఫైళ్లను కోర్టు ముందు ఉంచేలా ఆదేశించండి’’ అని విన్నవించారు.