Classroom Innovation: నో బ్యాక్ బెంచ్
ABN , Publish Date - Jul 22 , 2025 | 06:01 AM
తరగతి గదిలో బ్యాక్ బెంచ్‌లో కూర్చునే విద్యార్థి అంటే అల్లరి చేసేవాడనో, సరిగ్గా చదవని వాడనో నమ్మకం ఉంది.
తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో వినూత్న ప్రయోగం
‘యూ’ ఆకారంలో బెంచీల అమరిక.. విద్యార్థులందరిపై టీచర్ దృష్టి
నాగలాపురం, జూలై 21(ఆంధ్రజ్యోతి): తరగతి గదిలో బ్యాక్ బెంచ్‌లో కూర్చునే విద్యార్థి అంటే అల్లరి చేసేవాడనో, సరిగ్గా చదవని వాడనో నమ్మకం ఉంది. క్లాసురూమ్‌లో బెంచి వెనకాల బెంచి ఉండటం వల్ల పాఠం చెప్పే ఉపాధ్యాయుల దృష్టి కూడా వారిపై తక్కువగా ఉంటుంది. దీనికి చెక్ చెబుతూ తిరుపతి జిల్లా నాగలాపురం మండలం టీపీ కోట ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో వినూత్న ప్రయోగం చేశారు. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా క్లాసురూమ్‌లో యూ ఆకారంలో బెంచీలను అమర్చి సోమవారం నుంచి విద్యాబోధన చేపట్టారు. గతేడాది వినేశ్ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళం సినిమా ‘స్థానార్థి శ్రీ కుట్టన్’ క్లైమాక్స్ సీన్ స్ఫూర్తితో తొలుత కేరళలోని కొల్లం జిల్లా రామ విలాసం ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూలులో ప్రయోగాత్మకంగా యూ అకారం బెంచీల విధానాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కేరళలో అమలుచేస్తున్న ఈ విధానాన్ని టీపీ కోట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకున్నారు. దీంతో ఇకపై ఇక్కడి తరగతి గదుల్లో బ్యాక్ బెంచ్‌లు కనిపించవు. పాఠశాలల్లో యూ టైప్ సిట్టింగ్‌తో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వెంకటరమణ చెప్పారు. గది మధ్యలో ఉపాధ్యాయుడు నిలబడి పాఠాలు చెప్పడం వల్ల విద్యార్థులందరూ ఒకే స్థాయిలో అభ్యసన ప్రక్రియలో పాలు పంచుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. విద్యార్థులు సులభంగా వినడం, ఆచరించడం, మెరుగ్గా సంభాషించడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.