Jagan: నా పాలనలో కల్తీ మద్యమే లేదు
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:05 AM
నేను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కల్తీ మద్యమే కనిపించలేదు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా ప్రోత్సహిస్తోంది అని వైసీపీ అధినేత...
కూటమి హయాంలో కుటీర పరిశ్రమగా సాగుతోంది: జగన్
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ‘నేను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కల్తీ మద్యమే కనిపించలేదు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా ప్రోత్సహిస్తోంది’ అని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమానికి పిలుపిచ్చారు. ‘నేను అధికారంలో ఉండగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టేందుకు అడుగులు వేశా. కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి దాకా నిరసన కార్యక్రమాలను చేపట్టాలి. నేను 9న నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించి, ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభిస్తా. ప్రైవేటీకరణను నిరసిస్తూ కరపత్రాలను పంచుదాం. ఒక్కో పంచాయతీలో 500 మంది సంతకాలు చొప్పున కోటి సంతకాలు సేకరించాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సమన్వయకర్త 2 గ్రామాలను తప్పనిసరిగా సందర్శించాలి. గ్రామ సభలు నిర్వహించాలి. 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిద్దాం. నవంబరు 24న సేకరించిన సంతకాలను గవర్నర్‌కు అందిద్దాం’ అని తెలిపారు.