AP High Court: నల్లపరెడ్డిపై చర్యలు వద్దు
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:21 AM
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు...
తదుపరి విచారణ వరకు ఆగండి
దర్గామిట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు వేచి ఉండాలని దర్గామిట్ట పోలీసులకు తేల్చి చెప్పింది. ప్రసన్నకుమార్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా అదే రోజుకు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. మాజీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించిన సందర్భంలో తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు, తనపై దాడికి పాల్పడ్డారని పేర్కొంటూ స్పెషల్ బ్రాంచ్(ఎ్‌సబీ) హెడ్‌కానిస్టేబుల్ మాలకొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్గామిట్ట పోలీసులు నల్లపరెడ్డిపై కేసు నమోదు చేశారు.