అక్రమాలపై చర్యల్లేవ్!
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:31 AM
గుడ్లవల్లేరు పంచాయతీలో నిధుల దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈవోలుగా, బిల్ కలెక్టర్‌గా పనిచేసిన ఉద్యోగులు సుమారు రూ.30 లక్షల వరకు అక్రమాలకు పాల్పడితే గ్రామస్థులు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశించిన జిల్లా అధికారులు విచారణ నివేదిక సమర్పణలో జరుగుతున్న జాప్యంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు అక్రమాలకు పాల్పడిన వారు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
గుడ్లవల్లేరు పంచాయతీలో రూ.30 లక్షలు దుర్వినియోగం!
గతంలో పనిచేసిన ఈవోలు, బిల్ కలెక్టర్ నిర్వాకం
గ్రామస్థుల ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన జిల్లా అధికారులు
నెలరోజులకుపైగా కొనసాగుతున్న విచారణ
డీపీవో కార్యాలయానికి నివేదిక సమర్పించకుండా జాప్యం!
అక్రమాలకు పాల్పడిన వారిని అధికారులే కాపాడుతున్నారని చర్చ!
వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్
గుడ్లవల్లేరు పంచాయతీలో నిధుల దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈవోలుగా, బిల్ కలెక్టర్‌గా పనిచేసిన ఉద్యోగులు సుమారు రూ.30 లక్షల వరకు అక్రమాలకు పాల్పడితే గ్రామస్థులు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశించిన జిల్లా అధికారులు విచారణ నివేదిక సమర్పణలో జరుగుతున్న జాప్యంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు అక్రమాలకు పాల్పడిన వారు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం: గుడ్లవల్లేరు పంచాయతీకి ఇంటి పన్నులు, ఇతరత్రా పన్నుల రూపంలో ఏడాదికి రూ.80 లక్షలపైనే ఆదాయం సమకూరుతుంది. అయినా పంచాయతీలో ఒక్కపని సక్రమంగా చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ ప్రముఖులంతా కమిటీగా ఏర్పడి పంచాయతీ నిధులను సక్రమంగా వినియోగించకపోవడం, పంచాయతీలో పనిచేసే ఉద్యోగులు చేస్తున్న అక్రమాలపైౖన ఆరా తీశారు. పంచాయతీలో గతంలో పనిచేసిన ఈవోలు, బిల్‌కలెక్టర్ ఇంటి పన్నులు, చెరువుల వేలం పాటలు, ఇతరత్రా పన్నుల రూపంలో వసూలు చేసిన నగదును పక్కదారి పట్టించారని గుర్తించారు. గతంలో ఇక్కడ పనిచేసి వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లిన ఉద్యోగి రికార్డులు అప్పగించకపోయినా అతన్ని ఈవో రిలీవ్ చేశారనే విషయం కూడా బయటకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరిగిన సమయంలో వివిధ కారణాలతో ఈ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో పాలకవర్గం లేని పంచాయతీకి ప్రత్యేక అధికారులుగా గడచిన నాలుగు సంవత్సరాల్లో ఇద్దరు ఎంపీడీవోలు వ్యవహరించారు. అయినా పంచాయతీలో జరిగిన అక్రమాలను వీరు పట్టించుకోకపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే అంశంపైనా గ్రామస్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. నిధులు పక్కదారి పట్టిన అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.
రెండు నెలల క్రితం విచారణకు ఆదేశం
గుడ్లవల్లేరు పంచాయతీలో జరిగిన అక్రమాలపై డీపీవో కార్యాలయ అధికారులు రెండు నెలల క్రితం విచారణకు ఆదేశించారు. విచారణ అధికారులు, సిబ్బందిని కూడా నియమించారు. వీరు నెలరోజుల క్రితం పంచాయతీలోని వివిధ రకాల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గ్రేడ్-1 పంచాయతీగా ఉన్న గుడ్లవల్లేరులో విచారణ అధికారులుగా గ్రేడ్ తక్కువ ఉన్న పంచాయతీ కార్యదర్శులను నియమించడంపై పంచాయతీ కార్యదర్శులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా పక్కదారి పట్టించేందుకు తెరవెనుక పెద్దమంత్రాంగం నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు అధికారులు నిధుల దుర్వినియోగం అంశాన్ని పక్కదారి పట్టించి, అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులను కాపాడే ప్రయత్నంలో భాగంగా విచారణ చేయడంలో జాప్యం చేయిస్తున్నారని పలువురు పంచాయతీ కార్యదర్శులు చెప్పుకుంటున్నారు.
పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందా!
పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్న విచారణ అధికారులు రెండు నెలలు అవుతున్నా ఇంకా విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. ఈ విచారణలో ఆలస్యం వెనుక పంచాయతీరాజ్‌శాఖకు సంబంధించిన ఒకరిద్దరి అధికారుల ఒత్తిడి ఉందని పంచాయతీ కార్యదర్శులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. గతంలో ఈ పంచాయతీలో పనిచేసి, అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు తమదైన శైలిలో డీపీవో కార్యాలయ అధికారులతో మాట్లాడుకుని విచారణ వేగవంతం కాకుండా తెరవెనుక కథ నడుపుతున్నారని సమాచారం. గతంలో పక్కదారి పట్టించిన నగదును సర్దుబాటు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని, అప్పటి వరకు విచారణలో జాప్యం జరిగేలా చూడాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఒప్పందం వెనుక పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుడ్లవల్లేరు పంచాయతీలో ఇంటి పన్నులు, ఇతరత్రా పన్నుల రూపంలో వసూలు చేసి, పంచాయతీ ఖాతాలో జమకాని నగదు కనీసంగా రూ.30 లక్షలు వరకు ఉంటుందని సమాచారం. అక్రమాలపై విచారణకు ఆదేశించిన తర్వాత కూడా విచారణను వేగవంతంగా పూర్తి చేయకుండా, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారనే అంశంపై గ్రామంలో చర్చ జరుగుతోంది. అధికారులు ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి అక్రమాలకు పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.