Share News

‘ఇంటి’ దొంగలపై చర్యల్లేవ్‌!

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:45 AM

అవినీతి, అక్రమాలతో అస్తవ్యస్తంగా తయారైన జిల్లా గృహ నిర్మాణ సంస్థ పాలనను గాడిలో పెట్టేందుకు కలెక్టర్‌ బాలాజీ కాయకల్ప చికిత్స ప్రారంభించారు. గృహ నిర్మాణ సంస్థ పీడీగా ఉన్న వెంకట్రామ్‌ను పక్కనపెట్టి, పౌరసరఫరాలశాఖ విజిలెన్స్‌ విభాగం జిల్లా మేనేజరుగా పనిచేస్తున్న ఎస్‌.పోతురాజును ఇన్‌చార్జి పీడీగా నియమించారు. ఆయన రెండు రోజల క్రితం బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఉద్యోగులపై ఎంత వరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

‘ఇంటి’ దొంగలపై చర్యల్లేవ్‌!

- జిల్లా గృహ నిర్మాణ సంస్థలో ఇష్టారాజ్యంగా పాలన

- ప్రధాన కార్యాలయంలో పేరుకుపోతున్న ఫైల్స్‌

- క్లియర్‌ చేయాలంటే చేయి తడపాల్సిందే!

- కోడూరు మండలంలో రూ.39 లక్షల అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ

- ఘంటసాల మండలంలో అవినీతిపై విచారణ కోరిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌

- పెదపారుపూడి మండలంలో అక్రమాలపై నిగ్గుతేల్చినా చర్యలు శూన్యం

- పెడన పురపాలక సంఘంలో ఇళ్లు నిర్మించకుండానే బిల్లులు మంజూరు

- గృహ నిర్మాణ సంస్థ ఇన్‌చార్జి పీడీగా బాధ్యతలు చేపట్టిన పోతురాజు వీటిపై దృష్టి సారించేనా!

అవినీతి, అక్రమాలతో అస్తవ్యస్తంగా తయారైన జిల్లా గృహ నిర్మాణ సంస్థ పాలనను గాడిలో పెట్టేందుకు కలెక్టర్‌ బాలాజీ కాయకల్ప చికిత్స ప్రారంభించారు. గృహ నిర్మాణ సంస్థ పీడీగా ఉన్న వెంకట్రామ్‌ను పక్కనపెట్టి, పౌరసరఫరాలశాఖ విజిలెన్స్‌ విభాగం జిల్లా మేనేజరుగా పనిచేస్తున్న ఎస్‌.పోతురాజును ఇన్‌చార్జి పీడీగా నియమించారు. ఆయన రెండు రోజల క్రితం బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఉద్యోగులపై ఎంత వరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

జిల్లా గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఎవరికి వారే తమదైన శైలిలో పనిచేస్తున్నారు. ఏదైనా పనులపై అఽధికారులు కార్యాలయానికి వస్తే సరైన సమాధానం చెప్పేవారే ఉండనిస్థితి గత కొంతకాలంగా నెలకొంది. ఉద్యోగులు, అధికారులకు సంబంధించి పీఎఫ్‌, పదవీ విరమణ బెనిఫిట్‌లు, ఉద్యోగుల సర్వీస్‌ మేటర్‌లు తదితర పరిపాలనాపరమైన అంశాలకు సంబంఽధించిన ఫైళ్లకు మోక్షం లభించడంలేదు. గతంలో ఇక్కడ పనిచేసి జిల్లాస్థాయి అధికారులుగా పదోన్నతి పొంది, వేరే జిల్లాల్లో పని చేస్తున్న అధికారులకు సంబంధించిన సర్వీస్‌ మేటర్‌ ఫైౖళ్లు కూడా కదపకుండా పోయాయని సమాచారం. ప్రతిపనికి ఒకరేటు నిర్ణయించి మరీ నగదు వసూలు చేయడం ఇక్కడ రివాజుగా మారిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గోడౌన్‌ ఇన్‌చార్జిగా పనిచేసే ఉద్యోగికి ఎలాంటి అర్హతలు లేకున్నా జిల్లా కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టును కట్టబెట్టారు. ఈ ఉద్యోగి తనదైన శైలిలో ఉద్యోగులు, అధికారులకు సంబంధించి సర్వీస్‌ మేటర్‌ ఫైళ్లను త్వరితగతిన పంపకుండా ఆటలాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతకాలంగా ఈ ఉద్యోగి పనితీరుపై అధికారులు, సిబ్బంది పలుమార్లు ఫిర్యాదులు చేసినా, ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. ఇన్‌చార్జి పీడీ అయినా ఈ ఉద్యోగి పనితీరుపై నిఘా పెట్టాలని గృహనిర్మాణ సంస్థలో పనిచేసే ఉద్యోగులంతా కోరుతున్నారు.

ఘంటసాల మండలంలో అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిగేనా!

గతంలో కోడూరు మండలంలో పనిచేసిన ఏఈ రెండు వేల టన్నుల ఇసుకను మాయం చేశారనే ఆరోపణలు వచ్చాయి. గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయం విజిలెన్స్‌ విభాగం అధికారులు ఈ అంశంపై విచారణ చేసి రూ.39 లక్షల మేర అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారించారు. ఈ ఏఈని ఆ తర్వాత ఘంటసాల మండలానికి బదిలీ చేశారు. కొడాలిలో ప్రైవేట్‌ గోడౌన్‌ను ఏర్పాటు చేసి సిమెంటు, ఇనుమును పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఫిర్యాదులు అందినా, ఆ శాఖ అధికారులు విచారణ చేయకుండా మిన్నకుండిపోయారు. ఘంటసాల మండలంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని, సంబంధిత ఏఈపై చర్యలు తీసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ పలుమార్లు గృహనిర్మాణశాఖ జిల్లా అధికారులకు సూచించినా, విచారణ చేయకుండా జాప్యం చేయడం గమనార్హం. పెదపారుపూడి మండలంలోని లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఇనుము, సిమెంటును ఇవ్వకుండా, గుంపగుత్తగా విక్రయించేశారు. ఈ అంశంపైఫిర్యాదులు అందడంతో విచారణచేశారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నివేదికను పక్కనపెట్టేశారు. ఈ అంశంపైనా నూతన పీడీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మోపిదేవి మండలంలో పనిచేసే ఉద్యోగి ఒకరు విద్యార్హతలు లేకున్నా మండల స్థాయి అధికారిగా కొనసాగుతున్నారని, ఈ అంశంపైనా విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.

ఇళ్లు నిర్మాణం చేయకుండానే బిల్లులు

పెడన పురపాలక సంఘంలోని పైడమ్మ కాలనీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గృహాల నిర్మాణం ప్రారంభించకుండానే బిల్లులు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి, సచివాలయ సెక్రటరీ కూడబలుక్కుని పునాదుల దశ దాటని, పునాదుల దశలో ఉన్న గృహాలకు లెంటల్‌ లెవల్‌, శ్లాబు దశల వరకు చేరుకున్నట్లుగా చూపి ముందస్తుగానే బిల్లులు కాజేశారు. ఇలా 100కుపైగా గృహాలకు బిల్లులు చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. పనులు చేయకుండానే బిల్లులు చేసిన గత అధికారులు, సిబ్బందిపై గృహనిర్మాణశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా సాచివేత ధోర ణితో వ్యవహరిస్తున్నారు.

గృహ ప్రవేశాలు జరిగేనా!

ఈ ఏడాది ఆగస్టు నాటికి 3,783 గృహాలను పూర్తి చేసి శ్రావణ మాసంలో గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అయితే ఈ లక్ష్మాన్ని చేరే అవకాశం కనిపించడంలేదు. ఇప్పటి వరకు కేవలం 428 గృహాల నిర్మాణాలను మాత్రమే పూర్తి చేశారు, కలెక్టర్‌ బాలాజీ ప్రతి నెలా 15 రోజులకో సారి గృహనిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించి, గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని చెబుతున్నా ఫలితం ఉండటం లేదు.

Updated Date - Jul 20 , 2025 | 12:46 AM