Share News

‘ఉపాధి’లో అవినీతిపై చర్యల్లేవ్‌!

ABN , Publish Date - May 19 , 2025 | 01:02 AM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 50 మంది పనిచేసిన చోట 250 మంది చేసినట్టు లెక్కల్లో చూపి భారీగా దోచుకుంటున్నారు. గ్రామస్థుల ఫిర్యాదులు, గ్రామ సభల్లో విచారణలో అక్రమాలు నిజమేనని తేలినా చర్యలు తీసుకోవడంలో అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు. వారినే మళ్లీ విధుల్లో కొనసాగిస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

‘ఉపాధి’లో అవినీతిపై చర్యల్లేవ్‌!

- గ్రామాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు

- ఎస్‌ఎన్‌ గొల్లపాలెంలో సస్పెన్షన్‌కు గురైనా.. అతనితోనే మళ్లీ పనులు

- సుల్తానగరంలో పనిచేసేది 50 మంది.. లెక్కల్లో 250 మంది!

- మచిలీపట్నం, గూడూరు మండలాల్లో అక్రమాలు చేసిన టెక్నికల్‌ అసిస్టెంట్‌ను కాపాడే ప్రయత్నం

- గ్రామసభల్లో అధికారులు విచారణ జరిపి నివేదికలు ఇచ్చినా చర్యలు శూన్యం

- నిందితుల నుంచి నగదు రికవరీలో తీవ్ర నిర్లక్ష్యం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 50 మంది పనిచేసిన చోట 250 మంది చేసినట్టు లెక్కల్లో చూపి భారీగా దోచుకుంటున్నారు. గ్రామస్థుల ఫిర్యాదులు, గ్రామ సభల్లో విచారణలో అక్రమాలు నిజమేనని తేలినా చర్యలు తీసుకోవడంలో అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు. వారినే మళ్లీ విధుల్లో కొనసాగిస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

మచిలీపట్నం మండలం ఎస్‌ఎన్‌ గొల్లపాలెంలో పనిచేసే ఫీల్ట్‌ అసిస్టెంట్‌ ఉపాధి పనుల్లో పలు అక్రమాలకు పాల్పడ్డాడు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా కలెక్టర్‌కు అన్ని ఆధారాలతో ఫీల్ట్‌ అసిస్టెంట్‌ నిర్వాకంపై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేసిన సమయంలో ఈ ఫీల్ట్‌ అసిస్టెంట్‌ గ్రామానికి చెందిన, లేవలేనిస్థితిలో ప్రభుత్వం నుంచి నెలనెలా రూ.15వేల సామాజిక పింఛను తీసుకుంటున్న మహిళతో పాటు గ్రామంలో లేని వారి పేరున జాబ్‌ కార్డులు ఇచ్చి పనులు చేసినట్లుగా రుజువైంది. రూ.1.70 లక్షలకుపైగా అక్రమాలు జరిగినట్టుగా అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. దీంతో సదరు ఫీల్ట్‌అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారు. అయితే ఈ ఫీల్ట్‌అసిస్టెంట్‌ గత వారం రోజులుగా మళ్లీ ఉపాధి కూలీలతో పనులు చేయిస్తున్నారు. ఈ విషయంపై గ్రామస్థులు శనివారం డ్వామా కార్యాలయానికి వెళ్లి సస్పెండ్‌ అయిన ఫీల్ట్‌అసిస్టెంట్‌తో ఎలా పనిచేయిస్తున్నారని, ఎవరి లాగిన్‌లో నుంచి కూలీల వివరాలు అతను నమోదు చేస్తున్నాడని, అతన్ని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారా అనే అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరారు. దీంతో డ్వామా కార్యాలయ అధికారులు ఎస్‌ఎన్‌ గొల్లపాలెం ఫీల్ట్‌అసిస్టెంట్‌ను విధుల్లోకి తీసుకుంటూ తమ కార్యాలయం నుంచి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, ఎంపీడీవో కార్యాలయంలో వివరాలు తెలుసుకోవాలని చెప్పి పంపేశారు. గ్రామస్థులు ఎంపీడీవో కార్యాలయంలో సమాచార హక్కు చట్టం్ద ద్వారా వివరాలు ఇవ్వాలని అర్జీ అందజేశారు.

రెండు మండలాల్లో అక్రమాలకు పాల్పడినా!

మచిలీపట్నం, గూడూరు మండల పరిషత కార్యాలయాల్లో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన ఉద్యోగి పలు అక్రమాలకు పాల్పడినట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. మచిలీపట్నం మండల పరిషత కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ తన స్వగ్రామమైన వాడపాలెంలో తన కుటుంబసభ్యులు, బంధువుల పేరుతో రెండేసి జాబ్‌ కార్డులను టెక్నికల్‌ అసిస్టెంట్‌ సృష్టించాడు. హైదారాబాద్‌, ముంబయిలో ఉంటున్న వారి పేర్లతో జాబ్‌కార్డులు తయారు చేయించాడు. గ్రామంలో ఉన్న వారు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు పనిచేయకున్నా చేసినట్లుగా చూపి నగదును కాజేశాడు. వాడపాలెం గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని ఈ ఉద్యోగి చేసిన అక్రమాలపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు విచారణ చేసి పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వైసీపీ ప్రభుత్వ హాయాంలో ఈ టెక్నికల్‌ అసిస్టెంట్‌ అక్రమాలకు పాల్పడటంతో కొంతకాలం సస్పెండ్‌ చేశారు. అనంతరం గూడూరు మండల పరిషత కార్యాలయంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా మళ్లీ ఉద్యోగం ఇచ్చారు. వైసీసీకి సానుభూతిపరుడిగా ఉన్న వాడపాలెం సర్పంచ్‌ కుమారుడు టెక్నికల్‌ అసిస్టెంట్‌ కావడంతో అతనికి మళ్లీ ఉద్యోగం ఇచ్చారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. గూడూరు మండల పరిషత కార్యాలయంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ అక్కడ కూడా అక్రమాలకు పాల్పడటంపై ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేసిన అధికారులు అతన్ని సస్పెండ్‌ చేశారు. అయినా అక్రమంగా తీసుకున్న సొమ్మును రికవరీ చేయకుండా, శాఖాపరంగా తదుపరి చర్యలు తీసుకోకుండా డ్వామా అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు.

సుల్తానగరంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తీరుపై సర్వత్రా విమర్శలు

మచిలీపట్నం మండలం సుల్తానగరంలో ఫీల్ట్‌ అసిస్టెంట్‌ తీరుపై అనేక అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గ్రామంలో ప్రస్తుతం రోజుకు 50 మంది ఉపాధి కూలీలు పనిచేస్తుంటే.. 250 మందికి పైగా పనులు చేస్తున్నట్లుగా ఫీల్ట్‌ అసిస్టెంట్‌ నమోదు చేస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఫీల్ట్‌ అసిస్టెంట్‌ చేస్తున్న అక్రమాలపై పూర్తి వివరాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు. మచిలీపట్నం మండలంలోని చిన్నాపురం పంచాయతీలో ఫీల్ట్‌అసిస్టెంట్‌గా మహిళ పనిచేస్తున్నట్లుగా అధికారికంగా ఉంది. కానీ ఆమె ఐదేళ్ల క్రితమే వివాహం చేసుకుని వేరే గ్రామంలో ఉంటోంది. ఈ మహిళ తండ్రి తన కుమార్తె పేరుతో ఉపాధి హామీ పనులు చేయిస్తున్నాడు. ఇతను చేసిన అక్రమాలపై గ్రామస్థులు 90 పేజీలతో కూడిన వివరాలతో అఽధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేసిన సమయంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయినా ఫీల్ట్‌ అసిస్టెంట్‌గా అనధికారికంగా అతడినే అధికారులు కొనసాగించడంపై గ్రామస్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 19 , 2025 | 01:03 AM