Share News

Indian Navy: నిస్తార్‌ జలప్రవేశం

ABN , Publish Date - Jul 19 , 2025 | 06:59 AM

ఆపదలో చిక్కుకున్న జలాంతర్గాములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో స్వదేశీయంగా నిర్మించిన ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డులో శుక్రవారం జలప్రవేశం చేసింది.

Indian Navy: నిస్తార్‌ జలప్రవేశం

విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఆపదలో చిక్కుకున్న జలాంతర్గాములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో స్వదేశీయంగా నిర్మించిన ‘ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌’ విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డులో శుక్రవారం జలప్రవేశం చేసింది. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌ దీన్ని జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నౌకను లోతైన సముద్రంలో సహాయక కార్యకలాపాలు చేపట్టడానికి రూపొందించారన్నారు. ప్రపంచంలో కొన్ని దేశాల వద్దే ఇలాంటి ప్రత్యేక డైవింగ్‌ టీమ్‌ కలిగిన సహాయక నౌకలు ఉన్నాయని, అందులో భారత్‌ కూడా చేరడం గర్వకారణంగా ఉందని చెప్పారు. నౌకాదళం చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ డైవింగ్‌ సహాయక నౌక పొరుగు ప్రాంతాలలో కూడా సబ్‌మెరైన్‌ రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం అందిస్తుందన్నారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్‌ ఎదుగుదలకు నిస్తార్‌ ఓ నిదర్శనంలా నిలుస్తుందన్నారు.


ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ ప్రత్యేకతలు

  • హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో నిర్మించిన నిస్తార్‌ బరువు 10,500 టన్నులు. పొడవు 120 మీటర్లు.

  • దీనిపై హెలికాప్టర్‌ దిగేందుకు వీలుగా ప్రత్యేక హెలిప్యాడ్‌ ఉంటుంది.

  • దీనిలోని డైవింగ్‌ బృందం సముద్రం లోపల 300 మీటర్ల లోతు వరకు డైవింగ్‌ చేసి, సహాయక చర్యలు చేపడుతుంది.

  • ఈ నౌకలో రిమోట్‌తో ఆపరేట్‌ చేయగలిగే వాహనాలుంటాయి.

  • సముద్రం లోపలకు వెళ్లి రెస్క్యూ నిర్వహించే బోట్లకు ఇది మదర్‌ షిప్‌గా వ్యవహరిస్తుంది.

  • ప్రమాదంలో చిక్కుకున్న సబ్‌మెరైన్లలోని సిబ్బందిని రక్షిస్తుంది.

Updated Date - Jul 19 , 2025 | 07:02 AM