Share News

Nirmala Sitaraman: జీసీసీలు అంటే గుర్తొచ్చేది భారతీయులే

ABN , Publish Date - Sep 18 , 2025 | 03:27 AM

జీసీసీలు అంటే బ్యాక్‌ ఆఫీసులు కాదని, ఫ్యూచర్‌ రెడీ సెక్టార్‌ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. విశాఖలో జీసీసీ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో ఆమె ప్రసంగిస్తూ...

Nirmala Sitaraman: జీసీసీలు అంటే గుర్తొచ్చేది భారతీయులే

  • ఇదే భావన ప్రపంచ వ్యాప్తంగా ఉంది.. ప్రధాని గుర్తించారు

  • వీటి అభివృద్ధికి ఏపీ అనుకూలం

  • విశాఖలో సదస్సు నిర్వహించాలని చంద్రబాబు కోరారు

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): జీసీసీలు అంటే బ్యాక్‌ ఆఫీసులు కాదని, ఫ్యూచర్‌ రెడీ సెక్టార్‌ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. విశాఖలో జీసీసీ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో ఆమె ప్రసంగిస్తూ, ప్రపంచంలోని జీసీసీల్లో 50 శాతం మనదేశంలోనే ఉన్నాయన్నారు. ఇతర దేశాల్లోని జీసీసీల్లో సైతం భారతీయులే కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. జీసీసీ అనగానే భారతీయులు అనే భావన ఉందన్నారు. వీటి ప్రాధాన్యాన్ని ముందే గుర్తించిన ప్రధాని మోదీ ప్రత్యేక పాలసీకి ఆదేశించారని గుర్తు చేసుకున్నారు. సీఐఐతో కలిసి జీసీసీలపై తొలుత ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహించామని చెప్పారు. తరువాత ఎక్కడ? అని ఆలోచిస్తే.. విశాఖపట్నంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు కోరారన్నారు. అరకు కాఫీని పారిస్‌కు తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబుది అంటూ ప్రశంసించారు. జీసీసీల అభివృద్ధి చెందడానికి అవసరమైన మౌలిక వసతులతో పాటు కీలక అంశాలు ఇక్కడికి రప్పించాయన్నారు. ఏపీని క్వాంటమ్‌ వ్యాలీగా మారుస్తున్నారని, శ్రీహరి కోటలో అంతరిక్ష పరిశోధన కేంద్రం అభివృద్ధి చేస్తున్నారని, విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ కూడా ఏర్పాటు కానుందని, అవన్నీ జీసీసీల అభివృద్ధికి దోహదపడతాయన్నారు. జీసీసీలు అభివృద్ధి చెందాలంటే మూడు కీలకమైన అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు. డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో పెట్టుబడులు పెంచాలని, విద్య, నైపుణ్య రంగాల్లో మానవ వనరులను తీర్చిదిద్దాల్సి ఉందని, పరిపాలనా పరమైన వసతులు సమకూర్చాలని సూచించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సహకరించినప్పుడే జీసీసీలు అనుకున్న లక్ష్యాలు చేరుకుంటాయని చెప్పారు. కార్పొరేట్ల కోసం సి-పేస్‌, కంపెనీ ఇన్‌కార్పొరేషన్‌ కోసం స్పైస్‌ ప్లస్‌ వంటి విధానాలు అమలులోకి తెచ్చామన్నారు.


ఏపీలో వేగవంతమైన పాలన

సీఎం చంద్రబాబు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ చక్కటి పాలన అందిస్తున్నారని నిర్మలా సీతారామన్‌ ప్రశంసించారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో గూగుల్‌తో డేటా సెంటర్‌ ఏర్పాటుకు చర్చలు జరిపినట్టు తనకు బాగా గుర్తుందని, కేవలం నాలుగు నెలల్లోనే ఒక అతి పెద్ద సంస్థను ఇక్కడకు రప్పిస్తున్నారని అన్నారు. ఎంతో వేగంగా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదన్నారు.అదేవిధంగా క్వాంటమ్‌ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 03:31 AM